calender_icon.png 19 January, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు సమాయత్తం

07-08-2024 02:23:08 AM

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యం 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కసరత్తు

హర్ ఘర్ తిరంగా కోసం కార్యాచరణ 

బీజేపీ పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచనలు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థలకు సమాయత్తం అయ్యేలా పార్టీ శ్రేణు లంతా కష్టపడి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు.

రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది అన్నదాతలను అన్యాయం చేసిందని, బాధిత రైతుల నుంచి ఫిర్యాదులను తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు, అన్నదాతలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలని కిషన్ రెడ్డి సూచించారు.

పార్ల మెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ర్టంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అర్హులైన రైతులందరికీ అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని, రుణమాఫీ కాని రైతులకు అండగా నిలుస్తామని ఆయన తెలిపారు.

పార్టీ రాష్ర్ట కార్యాలయంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు అద్భుత స్పందన వస్తోందని, నిత్యం వేలాది మంది బాధిత రైతుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ప్రతి జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు.

రచ్చబండ కార్యక్రమాల అనంతరం రైతుల సమస్యల పరిష్కారం కోసం, రైతులకు ఇచ్చిన 7 ప్రధాన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రశ్నించేలా, గోసపడుతున్న రైతులకు న్యాయం జరిగేలా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

హర్ ఘర్ తిరంగా కార్యాచరణ..

ఈ ఏడాది కూడా ఆగస్టు 15 సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించుకునేందుకు బీజేపీ నిర్ణయించిందని బీజేపీ అధికార ప్రతినిధి డా. కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.

* ఆగస్టు 7న అన్ని జిల్లాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణ కోసం విధివిధానాలపై సమావేశం.

* ఆగస్టు 8, 9 తేదీల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసేలా కార్యాచరణ.

* ఆగస్టు 10, 11 తేదీల్లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి ఆ మహనీయులకు నివాళులర్పించి, స్మరించుకునే కార్యక్రమంతో పాటు స్మారక చిహ్నాల వద్ద స్వచ్ఛ భారత్ కింద పరిశుభ్రత కార్యక్రమాలు.

* ఆగస్టు 11, 13 తేదీల్లో జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ కేంద్రాలు, ప్రతి మండలం, మున్సిపాలిటీల స్థాయిలో యువమోర్ఛా ఆధ్వర్యంలో తిరంగ యాత్ర.

* ఆగస్టు 12న మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళలతో బైక్ ర్యాలీల నిర్వహణ.

* ఆగస్టు 13 నుంచి -15 వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఇల్లు, భవనాన్ని సందర్శించి ప్రజలందరూ హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములయ్యేలా చూడటం. 

* ఆగస్టు 13వ తేదీన రాష్ర్టంలో అన్ని జిల్లాల్లోని ప్రసిద్ధిగాంచిన ప్రాంతాల్లో సంఘసేవకులు, ప్రముఖులను సమీకరించి, సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం. 

* ఆగస్టు 14న విభజన గాయాల స్మారక దినం... దేశ విభజన సమయంలో జరిగిన దారుణమైన ఉచకోతలపై ప్రజలపై జరిగిన దారుణాలు, చీకటి అధ్యాయంపై జిల్లా కేంద్రాల్లో సమావేశాల ద్వారా ప్రజలందరికీ వివరించేలా కార్యక్రమాలు. 

* ఆగస్టు 15న రాష్ర్టంలో ప్రతి బూత్, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం.