calender_icon.png 26 November, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు సమయమిదే

21-10-2024 12:58:57 AM

  1. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు 
  2. ప్రజలందరూ సహకరించాలి 
  3. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  4. దేశమంతా రిజర్వేషన్ సాధించాలి 
  5. అఖిల పక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగపరంగా హక్కులు, రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన కులగణన ఇప్పుడు కాకపోతే భవిష్యత్‌లో ఎప్పటికీ కాదని పలు రాజకీయ పార్టీల బీసీ నాయకులు అభిప్రాయపడ్డారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘కులగణన ప్రణాళిక’ అనే అంశంపై ఆదివారం సోమా జిగూడ ప్రెస్ క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బీఆర్‌ఎస్ నుంచి శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, సీపీఐ నుంచి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీ హన్మంతరావు మాట్లాడుతూ.. తరతరాలుగా బీసీలకు జరుగు తున్న అన్యాయానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం మేల్కొలుపు లాంటిదని చెప్పారు. అట్టడుగువర్గాలకు న్యాయం చేయాలనే రాహుల్‌గాంధీ తాపత్రయపడుతున్నారని, అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.

ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్రమోదీ దేశానికి ప్రధాని అయినా బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాహుల్ ప్రధాని అయి ఉంటే దేశవ్యాప్తంగా బీసీ కులగణన సులువుగా జరిగేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టే కులగణనలో ప్రతిఒక్కరూ తమ కులాన్ని చెప్పుకోవాలని, అప్పుడే మన జనాభా సంఖ్య స్పష్టంగా తెలుస్తుందన్నారు.

అగ్రకులాల లెక్క కూడా తేలాల్సిన అవసరం ఉందని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని వెల్లడిం చారు. 1990 దశకంలోనే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం వచ్చినా, తమ పార్టీలోని అగ్రకులాల నాయకులు వ్యతిరేకించి అన్యాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బీసీ వర్గాలు సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు. 

అణగారిన వర్గాల పక్షాన కమ్యునిస్టులు : కూనంనేని  

భారతదేశంలో కులం అనేది ఒక రియాల్టీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ బీసీలు, అణగారిన వర్గాల పక్షాన నిలబడుతుందన్నారు. కులం వేరైనా కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా తాను బీసీనేనని, తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని స్పష్టంచేశారు.

బీసీల హక్కుల సాధన కోసం తమ పార్టీలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కులగణన తర్వాత రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని సూచించారు. బీసీల న్యాయ పోరాటానికి తప్పకుండా మద్ధతిస్తామని తెలిపారు. 

తెలంగాణలో బీసీ ఉద్యమం : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

తెలంగాణలో ఎల్లప్పుడూ ఒక ఉద్యమం ఉంటుందని, ప్రస్తుతం బీసీ ఉద్యమం నడుస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ సంఘాల శ్రమకు ఫలితం రాబోతుందని సంతోషం వ్యక్తంచేశారు. బీసీలకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ అధికార ంలోకి వచ్చిందని, కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

ఏ సాకులు చెప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నిర్ధారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సర్పంచ్ కానీ కులాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్ చూడని కులాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు, ప్రతిదాడులకు బీసీలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు కులగణన పూర్తి చేస్తేనే రాహుల్‌గాంధీపై నమ్మకం వస్తుందన్నారు. రాహుల్‌గాంధీతో సమావేశం ఏర్పాటు చేసే తాము వస్తామని స్పష్టం చేశారు. 

జీవో ౧౮ను స్వాగతిస్తున్నాం: జాజుల శ్రీనివాస్‌గౌడ్

తమ పోరాటం బీసీల సంక్షేమం కోసమేనని, పార్టీలను బద్నాం చేసేందుకు కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. జీవో 18ను స్వాగతిస్తున్నామని, కానీ దానిని సం పూర్ణంగా అమలు చేసే వరకూ పోరాటం ఆపబోమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కులగణన సాధించేందుకు అన్ని రాష్ట్రాల్లోని బీసీ సంఘాలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం చేసే పోరాటాన్ని తెలంగాణ నుంచే ప్రారంభించామని తెలిపారు.

ఈడబ్ల్యూఎస్ విధా నం రద్దు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని, కులగణనతో అగ్రకులాల బండారం బయటప డుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం, 136 బీసీ కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ప్రజల సహకారం లేకుండా కులగణన విజయవంతం కాదన్నారు.

బీసీలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. బీసీ కమిషన్ నియామక నోటిఫికేషన్‌లో డెడికేటెడ్ కమిషన్ అని పేర్కొన్నారని, దానిని మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఏ చిన్న తప్పు దొరికినా మళ్లీ కులగణన పెండింగ్‌లో పడే అవకాశం ఉందని అన్నారు.

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గణేష్‌చారి, బాలాజీ, బాల మల్లేష్, మణిమంజరి పాల్గొన్నారు. 

అన్ని రంగాల్లో సమన్యాయం జరుగట్లేదు: మధుసూదనాచారి

సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగా ల్లో బీసీలకు సమన్యాయం జరగడం లేదని శాసన మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కులగణనను చేపట్టినప్పటికీ మన హక్కులు సాధించే వరకూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అవమానం, అణచివేతకు వీ హన్మంతరావు ప్రతీక అని, ఆయన బీసీ కులాల్లో కాకుండా వేరే కులానికి చెందిన వారైతే కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారని అన్నారు. తమిళనాడు బీసీల్లో చైతన్యం ఉండటంతోనే వారు నిర్ణయాత్మక స్థితిలో ఉన్నారని చెప్పారు.

తెలంగాణలోని బీసీల్లో కూడా ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుందని, ఈ రకంగా పట్టువిడువకుండా ఉంటేనే లక్ష్యం సాధిస్తామని చెప్పారు. బీసీల హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.