- రెండో ఇన్నింగ్స్‌లో 172/0
- 218 పరుగుల ఆధిక్యంలో భారత్
- సెంచరీ దిశగా జైస్వాల్, రాహుల్ ఫిఫ్టీ
- ఆస్ట్రేలియా 104 ఆలౌట్
2 - ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్‌కు (172) రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986లో గావస్కర్, శ్రీకాంత్ జోడీ తొలి వికెట్‌కు 191 పరుగులు జోడించారు.
34 - టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా జైస్వాల్ రికార్డు
పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అజేయ అర్థశతకాలతో చెలరేగడంతో పెర్త్ టెస్టులో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగి సే సమయానికి టీమిండియా 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసిం ది.
జైస్వాల్ (193 బంతుల్లో 90 నాటౌట్) సెంచరీకి చేరువ కాగా.. కేఎల్ రాహుల్ (153 బంతుల్లో 62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 172 పరుగులు అజేయంగా జోడించడంతో టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్‌ను కకావికలం చేసిన ఆసీస్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తి గా తేలిపోయారు.
తొలిరోజు సీమర్లకు విశేషంగా అనుకూలించిన పిచ్ రెండో రోజుకు పూర్తిగా మారిపోయింది. అయితే పెర్త్ పిచ్‌పై 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధించడం కష్టతరమని గత రికార్డులు చెబుతున్నాయి. అయితే మూడో రోజు కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే మాత్రం భారత్ ఆసీస్ ముందు 500 పరుగులకు పైగా టార్గెట్‌ను ఉంచడమే ఉత్తమం.
బుమ్రాకు ఐదు వికెట్లు..
అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు కుప్పకూలింది. 67/7తో క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 37 పరుగులు జోడించింది. కెప్టెన్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రానా 3, సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది.
జైస్వాల్ మాస్.. రాహుల్ క్లాస్
రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఈసారి మాత్రం గేర్ మార్చింది. కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటతీరుతో ఆసీస్ ఆటగాళ్ల సహనానికి పరీక్ష పెట్టగా.. జైస్వాల్ ఎప్పటిలానే తన దూకుడు ప్రదర్శించాడు. బ్యాటింగ్‌కు అంతంతమాత్రమే అనుకూలిస్తున్న పిచ్‌పై జైస్వాల్, రాహుల్ నిలకడ ప్రదర్శించారు.
ఏ మాత్రం ఆలసత్వం ప్రదర్శించకుండా ఇద్దరు ఓపికతో బ్యాటింగ్ చేశారు. 26 ఓవర్లలో 84 పరుగులతో టీమిండియా టీ విరామానికి వెళ్లింది. ఆఖరి సెషన్‌లో భారత్ 31 ఓవర్లలో 88 పరుగులు జోడించి 172 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించారు.