calender_icon.png 1 November, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

12-05-2024 03:02:29 AM

ఎన్నికల విధుల్లో 73 వేల మంది పోలీసులు

డీజీపీ రవిగుప్తా ప్రకటన

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): పోలింగ్ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేసినట్లు డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలిగినా సహించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై డీజీపీ శనివారం వివరించారు. 17 లోక్‌సభ నియోజకవర్గాలలో సోమవారం జరగనున్న పోలింగ్‌ను స్వేచ్ఛగా నిర్వహించే లక్ష్యంతో విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

ఇందుకోసం 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ బలగాలు, 164 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ కంపెనీలు, 2,088 మంది ఇతర శాఖల సిబ్బంది, 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ప్రకారం రాష్ట్ర పోలీసులు భద్రతా తనిఖీ కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ నెట్‌వర్క్‌లో 482 ఫిక్స్‌డ్ స్టాటిక్ టీమ్‌లు, 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, 89 ఇంటర్- స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టు, 173 ఇంటర్-జిల్లా చెక్ పోస్టులు పని చేస్తున్నాయన్నారు. నేరచరిత్ర ఉన్న వారిని గుర్తించి 34,526 మందిని బైండోవర్ చేసామన్నారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, మే 12 ఉదయం 7 గంటల నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. స్ట్రాంగ్‌రూమ్‌కు చిట్టచివరి ఈవీఎం సురక్షితంగా పంపించే వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు.