18-03-2025 01:21:13 AM
బాబ్రీ మసీదులా కూల్చేస్తామంటూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ హెచ్చరిక
అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం.. సందర్శకులపై ఆంక్షలు
కల్మా తగులబెట్టారనే పుకార్లతో నాగ్‌పూర్‌లో ఘర్షణ
ముంబై, మార్చి 17: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వద్ద దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం సోమవారం భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీ స్థాయిలో పోలీసులను మోహరించడంతోపాటు సందర్శకులపై ఆంక్షలు విధించింది.
ఈ క్రమంలో ఔరంగజేబు సమాధి ని సందర్శించాలనుకునే పర్యాటకులు ఇక పై భద్రతా బలగాలకు తమ గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ వద్ద రిజిస్టర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని భద్రతా అధికారులు వెల్లడించారు.
ఔరంగజేబు సమాధిని ప్రభుత్వం కూల్చివేయాలని లేని పక్షంలో తామే ఆ పని పూర్తిచేస్తామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్‌లు హెచ్చరించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
బాబ్రీ మసీదులా కూల్చేస్తాం
రాష్ట్రంలోని ఔరంగజేబు సమాధిని ప్రభుత్వం కూల్చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లు దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారును డిమాండ్ చేశాయి. ఒకవేళ సమాధిని ప్రభుత్వం కూల్చకుంటే తామే కూల్చేస్తామని ఆదివారం హెచ్చరించాయి. ఈ క్రమంలోనే సోమవారం రెండు సంస్థలూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
నిరసనల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు కూడా వీహెచ్‌పీ మెమోరాండాన్ని అందించింది. మత మార్పిడికి నిరాకరించారన్న కోపంతో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ అయన ఇద్దరు కుమారులను ఔరంగజేబు హత్య చేశారని సీఎంకు అందించిన మెమోరాండంలో గుర్తు చేసింది.
అలాగే మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఔరంగజేబు హింసించి చంపడతోపాటు దేశ వ్యాప్తంగా పలు ఆలయాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. ఔరంగజేబు స్మారక చిహ్నాన్ని బానిసత్వానికి చిహ్నంగా పేర్కొన్న వీహెచ్‌పీ.. ఆయన సమాధిని కూల్చివేయాలని సీఎంను కోరింది.
రక్షించాల్సిన బాధ్యత ఉంది
ఔరంగజేబుకు చిత్రహింసల చరిత్ర ఉన్నప్పటికీ ఆయన సమాధికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సి రావడం దురదృష్టికరం. అయితే ఔరంగజేబు వారసత్వాన్ని కీర్తించే ప్రయత్నాలను ప్రోత్సహించబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అంతకుముందు ఔరంగజేబు సమాధిని తొలగించడానికి అందరూ అనుకులంగా ఉన్నారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
నాగ్‌పూర్‌లో ఘర్షణ
వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసనల్లో కల్మాను తగలబెట్టినట్టు కొన్ని ముస్లిం సంఘాలు ఆరోపించినట్టుగా సామాజిక మాద్య మాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో రెండు వర్గాలు రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో నాగ్‌పూర్‌లో భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరిం చాయి.
భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టాయి. ఘర్షణలకు పుకార్ల వ్యాప్తే కారణమని అధికారులు స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలో ఐదుగురు సాధారణ పౌరులు గాయపడటంతోపాటు 15 మంది పోలీసులకు కూడా గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సీఎం కోరారు.