- కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సంచారం
- భయాందోళనలో ప్రజలు
నిర్మల్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రోడ్లపైనే పులులు సంచరిస్తూ వాహనదారుల కంటపడ్డాయి. నిర్మల్ జిల్లాలో చిరుతల భయం పట్టుకున్నది. నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండలం కాల్వ నర్సింహాస్వామి రోడ్డు వద్ద నిర్మల్ మార్గంలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చిరుత రోడ్డుపై సంచరించింది.
అటుగా వెళ్తున్న వాహనదారులు చిరుతను ఫోన్‌లలో వీడియో తీశారు. కాల్వ లోలం మధ్య ఉన్న దట్టమైన అడవిలో నుంచి సిర్గాపూర్ వైపు వెళ్లేందుకు చిరుత రోడ్డు పైకి వచ్చి 3 నిమిషాల పాటు అక్కడే ఉన్న వీడియోలు వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రదేశంలో దాని పాద ముద్రులు గుర్తించారు.
ఎటు వైపు వెళ్లిందో తెలుసుకునేందుకు రెండు బృందాలు గాలిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దిలువార్‌పూర్, నర్సాపూర్ మండలాల్లోని కుస్లీ, అంజనితండా, కుస్లీ తండా మాడేగాం, కదిలి, ప్యారమూర్ లోలం కాల్వ తదితర గ్రామాల్లో పశువులపై చిరుత దాడి చేసి చంపేసింది.
ఆ తర్వాత చిరుత జాడ లేకపోవడంతో వేరే ప్రదేశంలోకి వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం అర్ధరాత్రి ఇక్కడే కనిపించడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ చిరుత భయం పట్టుకున్నది.
ఘన్‌పూర్ శివారులో చిరుత
కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చిరుత పులి సంచరించింది. అటవీ ప్రాంతం నుంచి ఘన్‌పూర్(యం) గ్రామ పరిధిలోని రోడ్డును చిరుత దాటుతుండగా ప్రయాణికులు చూసి భయాందోళనలకు గురయ్యారు.
చిరుతను పట్టుకునేందుకు అటవీప్రాంతంలో బోనును ఏర్పాటు చేయాలని ఘన్‌పూర్ గ్రామస్థులు అటవీశాఖ అధికారులను కోరారు. అటవీశాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. త్వరలోనే అటవీప్రాంతంలో బోనును ఏర్పాటు చేస్తామని గ్రామస్థులకు తెలిపారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో..
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కొద్ది రోజులుగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తిరుగుతున్న పులికి స్థిర నివాసం లభించకపోవడంతో తరుచూ రోడ్డుపై దర్శనిమిస్తున్నది. మంగళవారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన హుడికిలి-వీరూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై దర్జాగా నడుచుకుంటూ కనిపించింది.
వాహనదారులు మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఇటీవలే సరిహద్దు అటవీ ప్రాంతంలోని అమృత్ గూడ గ్రామ ప్రధాన రహదారిపై పులి కనిపించింది. అంతకుముందు సిర్పూర్(టి) మండలంలోని చీలపల్లి, హుడికిలి, గుండాయిపేట్ గ్రామాల సమీపంలో బెబ్బులి సంచరించింది. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు.