- జిల్లాలో పెరుగుతున్న పులులు
- మహారాష్ట్ర నుంచి రాకపోకలు
- ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్27 (విజయక్రాంతి): విశాలమైన అటవీ సంపద కలిగిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వన్యప్రాణుల ఆవాసానికి నిలయంగా మారింది. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి జిల్లాకు పులుల రాకపోకలతో పాటు వైల్డ్ డాగ్స్, ఏనుగులు, ఇతర అటవీ జంతువులు వచ్చి జీవనం కోసం అనువైన అటవీ ప్రాంతం కోసం వెతుకుతున్నాయి.
జిల్లావ్యాప్తంగా 2,437 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణిహిత, పెన్‌గంగ, వైన్ గంగ నదులు, బాబ్రీనది (పెద్దవాగు) సహా మరికొన్ని వాగులు అటవీ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాకు మూడు వైపులా తాడోబా పులుల అభయారణ్యం, భామ్రాగఢ్, తిప్పేశ్వర్ అభయారణ్యాలున్నాయి. దీంతో పాటు కవ్వాల్ పులుల అభయారణ్యం ఉంది.
కారిడార్‌గా కాగజ్‌నగర్ డివిజన్
కవ్వాల్ అభయారణ్యం ఏర్పాటుతో మహారాష్ట్రలోను పులులకు కాగజ్‌నగర్ డివిజన్‌లోని అటవీ ప్రాంతం కారిడార్‌గా మారింది. అంకుసాపూర్, కడంబా, దరిగాం అడవుల్లో పులులు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. కవ్వాల్ అభయారణ్యానికి కారిడార్‌గా ఉండాల్సిన జిల్లా అటవీ ప్రాంతం ఇక్కడే పులులకు ఆవాస కేంద్రంగా మారింది.
గతంలో పులులు ఎప్పుడూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. ఇటీవల కాలంలో వాటి నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అటవీ ప్రాంతం అనుకులంగా ఉండటంతో పులుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అధికారులు కేవలం 6 పులులు ఉండొచ్చని చెబుతున్నప్పటికీ జిల్లాలో చిరుత, పెద్దపులులు కలిపి 10 నుంచి 12 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
పులులు పెంచడమే లక్ష్యంగా!
మహారాష్ట్ర నుంచి వచ్చే పులులకు కారిడార్‌గా మారిన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ అడవులను ఇకపై పులులకు శాశ్వత నివాస ప్రాంతంగా మార్చాలని అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. పులుల సంరక్షణతో పాటు వాటి సంఖ్యను పెంచే ఉద్ధేశంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పోడు వ్యవసాయానికి సైతం చెక్ పెట్టి ప్లాంటేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పులులకు అనుకులంగా ఉండేలా వాతావరణం కల్పించి అవసరమైతే టైగర్ బ్రీడింగ్ జోన్‌గా మార్చందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్ మండలంలోని ఇటికెలపహాడ్‌లో 600 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టారు. దీంతో మహారాష్ట్ర తాడోబా నుంచి పులి రాకపోకలకు ఈ ప్లాంటేషన్ కీలకంగా మారడంతో దీని స్ఫూర్తితోనే మిగతా ఫారెస్ట్‌లో ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.