11-12-2024 01:31:18 AM
ములుగు(జనగామ), డిసెంబర్ 10 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని అలువాక బోధపురం ప్రాంతంలోని గోదావరి పాయలో మంగళవారం పెద్దపులి అడుగులు కనిపించడం కలకలం రేపింది. ఆలువాక బోధపురం గోదావరి తీర ప్రాంతంలో పచ్చని పంటలు సాగవుతున్నాయి. సోమవారం రాత్రి ఈ పంటల వద్ద నిద్రించిన కొందరు రైతులకు పులి గాండ్రింపులు వినిపించాయి.
మరుసటి రోజు మంగళవారం ఉదయం గోదావరి తీర ప్రాంతం లో పెద్ద పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అడుగులను పరిశీలించిన అధికారులు పెద్ద పులివేనని నిర్ధారించారు. గతంలోనూ ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పెద్దపులి సంచరించి పలు పశువులపై దాడి చేసింది.
మళ్లీ పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలువాక బోధపురం ప్రాంతం నుంచి పెద్ద పులి ఎటు వెళ్లిం దో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ ప్రాంత రైతులు పశువుల మేత కోసం అటవీ లోపలి ప్రాంతంలోకి వెళ్లొద్దని, పులి జాడ కనిపిస్తే దాడి చేయవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని అటవీ అధికారులు కోరారు.