09-04-2025 12:46:00 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): గత కొద్ది రోజుల కిందట బెల్లంపల్లి పరిసర అటవీ ప్రాంతంలో సంచరించి ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి(Pedda Puli) మళ్లీ కాసిపేట అడవుల్లో సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులతో మళ్లీ భయానక వాతావరణం నెలకొంది. బెల్లంపల్లి బుగ్గ అటవీ ప్రాంతం తో పాటు కాసిపేట మండలంలోని దుబ్బ గూడెం, బుగ్గ గూడెం, కొత్త వరిపేట, దేవాపూర్ ప్రాంతాల్లో సంచరించి 12 రోజులపాటు ప్రజలను, అటవీ అధికారులను పెద్దపులి కంటిమీద కునుకు లేకుండా చేసింది. బుగ్గ అటవీ ప్రాంతం(Bugga forest area) నుంచి మాదారం బీట్ మీదుగా రేపల్లెవాడ, చంద్రవెల్లి, ఎల్లారం, దుగ్నేపల్లి ప్రాంతాలను దాటుకుని కుష్ణపల్లి ఫారెస్ట్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.
అక్కడినుండి భీమారం, చెన్నూర్ ప్రాంతానికి మకాం వేసిన పెద్దపులి రెండు నెలల కాలంలో మళ్ళీ కాసిపేట మండలంలోని గోండుగూడెం వద్ద రోడ్డు దాటుతుండగా కార్మికులు, పలువురు రైతులు చూసినట్లు వెలువడుతున్న వదంతులు ఈ ప్రాంతంలో ఆందోళనను రేకెత్తిస్తోంది. కొద్దికాలంగా పెద్దపులితోపాటు చిరుత సంచారం కూడా కాసిపేట మండల అడవుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో రెండు నెలల కిందట పెద్దపులి సంచరించడం , చిరుత పులి పశువుల , మేకల మందలపై దాడి చేయడం వాటి ఉనికిని స్పష్టం చేసింది.
పెద్దపులి భయం నుండి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న కాసిపేట, బెల్లంపల్లి, తాండూర్ మండలాల ప్రజలను తాజా వదంతులు మళ్లీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ విషయమై ముత్యం పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ ను వివరణ అడగగా వదంతులు వాస్తవం కాదని చెప్పారు. దీనిపై తాము ఎప్పటికప్పుడు నిఘా పెట్టి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. కాసిపేట పరిసర ప్రాంతాల్లో పెద్దపులి అడుగుజాడలు ఎక్కడ కనిపించలేదని ప్రస్తుతం జిల్లాలోని లక్షెట్టిపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఎక్కడైనా పెద్దపులి సంచరించినట్లు ఆనవాలు కనిపిస్తే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.