బెల్లంపల్లి, (విజయక్రాంతి): గత నాలుగు రోజుల నుండి తిర్యాణి అడవుల మీదుగా కన్నాల అటవీ ప్రాంతానికి వచ్చిన బీ2 అనే పెద్దపులి ఈ ప్రాంతంలోనే మకాం వేసి సంచరిస్తుంది. గురువారం సాయంత్రం నుండి కన్నాల -బుగ్గ అడవుల్లో సంచరిస్తూ అటవీ సిబ్బందికి కనిపించిన పెద్దపులి శనివారం కన్నాల ప్రాంతంలో అడవి పందిపై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. దీంతో కన్నాల-బుగ్గ రహదారిని అటవీ సిబ్బంది రాకపోకలు జరగకుండా మూసివేశారు.
పులి కదలికలపై డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టారు. అడవిలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచారంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఉదయం పెద్దపులి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అతి సమీపంలో సంచరించినట్లు అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. అడవిలో ఎగురుతున్న డ్రోన్ల సహాయంతో పులి కదలికలను తెలుసుకొని సిమెంటు రోడ్డు ప్రారంభానికి ముందే మట్టి రోడ్డుపై పెద్ద పులి పాదముద్రలను సేకరించారు. నాలుగు రోజులుగా పెద్ద పులి బుగ్గ దేవాలయానికి సమీపంలోనే సంచరిస్తుండడంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు.
బుగ్గ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిలిపివేత
కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా పెద్దపులి కదలికలు ఉండడంతో సోమవారం బుగ్గ దేవాలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్లు బుగ్గ దేవాలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు తెలిపారు. బుగ్గ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండడం తో భక్తులు ఎవరు కూడా ఆలయానికి రావద్దని ఆమె సూచించారు.