ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు
కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఫారెస్ట్ అధికారుల అసమర్ధత వల్లే పులి దాడులు జరుగుతున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు ఎంతసేపూ అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టారని, అందుకే అటవీ సంరక్షణ పులుల సంరక్షణ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఎంతసేపూ ఫారెస్ట్ కేసులు పెట్టి డబ్బులు గుంజుదామనే యావలో ఉన్న ఫారెస్ట్ అధికారులు వెంటనే జిల్లాను వదిలి వెళ్తే ఈ జిల్లా బాగుపడుతుందని సూచించారు. పులుల దాడుల్లో మనుషులు, మనుషుల వలన పులులు చనిపోవడం అంటే ఇది పూర్తిగా ఫారెస్ట్ అధికారుల అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
గత రెండేళ్లలో పులి నలుగురిని పొట్టన పెట్టుకుందని, అలాగే ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయారని, వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇంకా అందలేదన్నారు. కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ కుటుంబానికి ఇంకో పది లక్షలు చెల్లించాలని, అలాగే ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. పులులకు రేడియో కాలరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే పులులను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని, మహారాష్ట్ర విధానాన్ని అనుసరించాలని సూచించారు. రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయాలన్నీ లేవనెత్తుతామని తెలిపారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్, దెబ్బటి శ్రీనివాస్, బాల్క శ్యామ్ పాల్గొన్నారు.