22-04-2025 12:29:49 AM
ఒడిశాలోని పూరి జిల్లాలో దారుణ ఘటన
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. పూరి జిల్లాలోని కోటకోసంగా గ్రామంలో ఒక మైనర్ బాలుడు, యువకుడిని ఊరి గ్రామస్థులు తమ శత్రువులుగా భావించి విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. సిగరేట్ పీకలతో కాల్చిన అనంతరం మూత్రం తాగించారు. గ్రామంలో వారాంతపు సంతకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామస్తుల దాడిలో బాధితుల్లో ఒకరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా దాడి విషయాన్ని మైనర్ బాలుడు మీడియాతో పంచుకున్నాడు. ‘మేము గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లాం. అయితే మా ఇద్దరిని శత్రువులుగా భావించిన కొందరు గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారు’ అని చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా కోటకోసంగా, ప్రధాన్సాహి గ్రామాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మైనర్ బాలుడితో పాటు యువకుడిని ప్రధాన్సాహి గ్రామానికి చెందిన వారని భావించి దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.