19-04-2025 12:11:15 AM
బెంగాల్ అల్లర్లపై బంగ్లా అధికారి వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన భారత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారత్‌లోని పశ్చిమబెంగాల్‌లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై బంగ్లా విషం వెల్లగక్కింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ మీడియా కార్యదర్శి షఫీకుల్ ఆలం మాట్లాడుతూ.. ‘బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లలో నష్టపోయిన మైనారిటీ ముస్లిం వర్గాలను భారత అధికారులు కాపాడాలి.’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ దీటుగా స్పందించింది. బంగ్లాదేశ్ అనవసరమైన కామెంట్లు చేసే బదులు సొంత దేశంలోని మైనారిటీల స్థితిగతులపై దృష్టిసారిస్తే బాగుంటుందని విదే శాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వా ల్ హితవు పలికారు. ‘బెంగాల్‌లో జరిగిన సంఘటనలపై బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై కొనసాగుతున్న హింసను భారత ఆందోళనలతో సమానంగా చూపించేందు కు చేసిన అర్థరహితమైన వ్యాఖ్యలివి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే బదులు వాళ్ల సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడటం పై దృష్టి సారిస్తే బాగుంటుంది’ అని సూచించారు. బెంగాల్‌లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా చేసిన నిరసనల్లో దాదాపు 10వేల మంది పాల్గొన్నట్టు బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టుకు నివేదించింది.