calender_icon.png 4 January, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌ను బట్టే టికెట్ ధర!

28-12-2024 12:00:00 AM

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు బాబి కొల్లి తెరకెక్కిస్తున్న ‘డాకు మహారాజ్’ చిత్రానికి నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిర్మాత నాగవంశీ. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న టికెట్ల ధరల పెంపు అంశంపై స్పందించారు.

“సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలన్నింటికీ న్యాయం జరుగుతుంది. ఒక నిర్మాత సినిమా టికెట్ ధరను అతను పెట్టిన ఖర్చును, బయ్యర్లకు అమ్మిన ధరను ఆధారంగా చేసుకొని నిర్ణయించుకుంటాడు. ‘దేవర’ విషయంలో నాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి.. నాకు ఇంత ధర కావాలి అని ప్రభుత్వాలను కోరాను. అలానే ‘పుష్ప2’ విషయంలోనూ వాళ్లు పెట్టిన ఖర్చుకు టికెట్ ఏ ధరలో ఉంటే న్యాయం జరుగుతుందనుకున్నారో అదే అడిగారు.

సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేటు కరెక్ట్.. ఏ రేటు సరైనది కాదు అని చెప్పలేం. సినిమా ఆధారంగా అది మారుతూ ఉంటుంది. ప్రేక్షకులను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదు. సంవత్సరంలో విడుదలయ్యే రెండు, మూడు సినిమాలకే టికెట్ ధరలు పెంచుతున్నామంతే! ఈ ఏడాది కాలంలో ‘కల్కి’, ‘దేవర’, ‘పుష్ప2’.. ఈ మూడు సినిమాలకే పెంచారు” అని చెప్పారు. 

అర్జున్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయ్.. 

ఇంకా తన అప్‌కమింగ్ సినిమా, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘వీడీ12’ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు నాగవంశీ. ఒకవేళ ఆ సమయంలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయితే తమ సినిమా వాయిదా పడుతుందని తెలిపారు. ‘వీడీ12’ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని, ఇందులో మొత్తం 8 పాటలు ఉంటాయనీ, అన్ని పాటలనూ ఒకేసారి విడుదల చేస్తామని తెలిపారు.

ఈ సినిమా రెండు భాగాలు తీసుకొస్తున్నట్టు కూడా చెప్పారు. స్క్రిప్ట్ పనుల్లో ఉన్నప్పుడే పార్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇక అల్లు అర్జున్‌త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. బన్నీ కొంచెం ఫ్రీ అయిన తర్వాత చర్చించుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. వేసవిలో షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలిపారు.