calender_icon.png 2 November, 2024 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ.. బిలియనీర్లకే ప్రధాని

29-04-2024 12:05:00 AM

బీజేపీ, బీజేడీలు తెర వెనుక ఒకటే..

అంకుల్ జీ అంటూ మోదీపై విసుర్లు

‘పాన్’ చతుష్టయం ఒడిశాను దోచుకున్నాయి

ప్రధాని మోదీ, నవీన్ పట్నాయక్‌పై రాహుల్ విమర్శ

కటక్, ఏప్రిల్ 28: దేశంలోని ధనవంతుల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కొందరు వ్యక్తుల కోసం పనిచేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఒడిశాలోని కటక్ సమీపంలో ఉన్న సేల్‌పూర్ వద్ద జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ, బీజేడీ పెళ్లి చేసుకున్నాయని, అవి ఒకే ఎజెండా కోసం పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల్లో మాత్రమే బీజేపీ, బీజేడీ ఒకరితో ఒకరు పోరాడుతున్నట్టు నాటకాలు చేస్తున్నాయని, కానీ నిజానికి ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ పేరుకు మాత్రమే సీఎం అని, అసలు ప్రభుత్వాన్ని వీకే పాండ్యన్ నడుపుతున్నారంటూ విమర్శించారు.

ఒడిశాకు ‘పాన్’ ఇచ్చారు.. 

‘పాన్’ (పాండ్యన్, అమిత్‌షా, నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) చతుష్టయం కలిసి ఒడిశా ప్రజల సంపదను దోచుకున్నారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అంకుల్ జీ (మోదీ), నవీన్ బాబు (నవీన్ పట్నాయక్) కలిసి ఒడిశాకు ‘పాన్’ ఇచ్చారు. పాన్ చతుష్టయం కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారు. మైనింగ్ కుంభకోణం ద్వారా వాళ్లు రూ.9 లక్షల కోట్లు దోచుకున్నారు. భూ దందాలు చేసి ఏకంగా రూ.20 వేల కోట్లు దోచుకున్నారు. మొక్కలు నాటడం పేరుతో రూ.15వేల కోట్లు దోచుకున్నారు. కేంద్రం లో, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు దోచుకున్న సంపద మొత్తం తిరిగి లాక్కుంటాం’ అని పేర్కొన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్ మాట మార్చింది

డామన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్.. ఇప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటూ మాట మార్చిందని రాహుల్ దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిద్ధాంతానికి, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతానికి మధ్య పోరాటం జరుగుతోందని, దేశ రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ‘దేశానికి రాజ్యాంగం పునాది లాంటిది. ఆ విత్తనం నుంచే ఇప్పుడున్న అన్ని వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. రాజ్యాంగాన్ని వాళ్లు (బీజేపీ) సర్వ నాశనం చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజులను దేశానికి రాజులు చేయాలని చూస్తు న్నారు’ అని రాహుల్ అన్నారు.