calender_icon.png 22 September, 2024 | 1:55 AM

వలపు వల విసిరి.. బెదిరింపులకు పాల్పడి

20-09-2024 12:11:57 AM

అమ్మాయిలా గొంతుమార్చి మోసాలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రవాస భారతీయులే లక్ష్యం గా వలపు వల విసిరి (సెక్స్ టార్షన్) రూ. లక్షలు వసూలు చేస్తున్న ఓ సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలా గొంతు మార్చి మాట లు కలిపి ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి అక్కడే ఆరేళ్లపాటు పనిచేసిన బెంగళూరుకు చెందిన రిధి బేడి అనే యువకుడు ఉద్యోగం కోల్పోవడంతో జల్సాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితం గడపడానికి సెక్స్ టార్షన్‌ను ఎంచుకున్నాడు.

ఇతడి ప్రధాన టార్గెట్ వీఐపీలే కావడం గమనార్హం. ఇద్దరు మాట్లాడుకునే క్రమంలో వీడియో కాల్ సంభాషణ అంతా రికార్డు చేసి బెదిరించడం మొదలు పెట్టేవాడు. ప్రవాస భారతీయులనే లక్ష్యంగా చేసుకొని దందాకు తెరతీశాడు. అమ్మాయి గొంతుతో ముందుగా వీఐపీలను ట్రాప్ చేస్తున్న రిధి బేడి, వారిని బుట్టలో వేసుకొని న్యూడ్ కాల్స్ చేయించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలా రికార్డు చేసిన వీడియోలను సోషల్ సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడని, అలా చేయకుండా ఉండేందుకు రూ.లక్షలు డిమాండ్ చేసినట్లు తేలింది.

అలా ఇప్పటి వరకు దుబాయి సహా ఇండియాలో ప్రముఖుల దగ్గర నుంచి లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓ మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫోన్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేశా రు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెంది న రిధి బేడిని గురువారం అరెస్ట్ చేసి, కోర్టు లో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత పేర్కొన్నారు. నిందితుడి నుంచి ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో సహా పలు రకాల కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.