07-03-2025 12:37:30 AM
నల్లగొండ, మార్చి 6 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివి.. నల్లగొండలోని లైన్‌వాడకు చెందిన మహమ్మద్ హైమద్, షమీమున్నీసా బేగం కొంతకాలంగా పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేండ్ల కుమార్తె, మూడేండ్ల కుమారుడు (అబ్దుల్ రహమాన్) ఉన్నారు.
ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రహమాన్ దవాఖానలో ఆవరణలో ఆడుకుంటూ కనిపించకుండాపోయాడు. దీంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకు వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దవాఖాన ఆవరణలోని సీసీకెమెరాలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి బాలుడిని చంకనెత్తుకొని వెళ్లడం కనిపించింది.
కిడ్నాపర్‌ను గుర్తించేందుకు ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోని సీసీకెమెరాలను పరిశీలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సల్లగొండలోనే గుర్తుతెలియని ప్రదేశంలో కిడ్నాపర్ బాలుడిని ఉంచి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.