ఓలా ఎలక్ట్రిక్ సీఈవో ప్రకటన
ముంబై: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్లను అమాంతం పెంచేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ నెలాఖరుకల్లా 4 వేల స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సోమవారం ఓ ప్రకటన చేశారు.
‘విద్యుత్ వాహనాలకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచాలని నిర్ణయించాం. మా వినియోగదారులకు మరింత చేరువకావడమే దీని లక్ష్యం. డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లూ ఒకేసారి ప్రారంభించనున్నాం. బహుశా ఈ స్థాయిలో స్టోర్లను ప్రారంభించడం ఇదే తొలిసారి’ అని భవీశ్ తన పోస్ట్‌ల్లో పేర్కొన్నారు. ఆయా స్టోర్లలో ఓలా ఎలక్ట్రిక్ సర్వీసులూ లభిస్తాయని పేర్కొన్నారు.
విద్యుత్ వాహన విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌పై ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విక్రయానంతర సేవల విషయంలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వినియోగదారులహెల్ప్‌లైన్‌కు 10వేలకుపైనే ఫిర్యాదులు రావడం, దీనిపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలో కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేర్లు రాణించాయి. ఉదయం నష్టాల్లో ట్రేడవగామధ్యాహ్నం 1.40 గంటలకు దాదాపు 5 శాతం లాభంతో ఓలా షేర్లు రూ.91.67 వద్ద ట్రేడవుతున్నాయి.