calender_icon.png 20 October, 2024 | 7:04 AM

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు

20-10-2024 01:23:54 AM

మా ప్రభుత్వం జోలికి ఎవరొచ్చినా ఊరుకోం

డబుల్ ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రులు పొన్నం, పొంగులేటి హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఈ నెలాఖరులో 3500 నుంచి 4000 ఇళ్లను మంజూరు చేయబోతున్నామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 144 మంది లబ్ధిదారులకు మేడ్చల్ జిల్లా రాంపల్లిలో ఇళ్లను కేటాయించారు. అనంతరం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన నిర్వహించిన సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళ్లలో కట్టె పెట్టి తమ ప్రభుత్వాన్ని పడేయాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని ఆరోపించారు.  మూసీ విషయంలో తమ ప్రభుత్వా న్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మూసీ రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కాదా అని బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. తమ పాలనకు అడ్డుపడితే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. 

గులాబీ చొక్కా ధరిస్తేనే గతంలో 

పథకాలు అందజేశారు

తమ ప్రభుత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు మూసీ పేరి ట పేదలను తీసుకొచ్చి యాక్షన్ డ్రామాలు చేస్తున్నారని, సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా మూసీ ఒడ్డున బతుకుతున్న పేదలకు మూసీ కంపును దూరం చేయడానికే మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూసీపై బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. గులాబీ చొక్కా ధరిస్తేనే గత ప్రభుత్వంలో పథకాలందేవని ఎద్దేవా చేశారు. తమ హయాంలో మూడు రంగుల జెండా పట్టనవసరం లేదని, ఏ పార్టీకి చెందిన వారికైనా పథకాలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, శ్రీగణేష్, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, మీర్జా రహ్మత్‌బేగ్, అదనపు కలెక్టర్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.