విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థు లు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న స్వాతిప్రియ కుటుంబా నికి న్యాయం చేయాలని నిరసన చేస్తున్న ఏబీవీపీ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని శనివారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్వాతిప్రియ ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులను విడుదల చేయాలని కోరారు.
ఏబీవీపీ ముట్టడి పిలుపుతో ఉద్రిక్తత ఎక్కడికక్కడ నేతల అరెస్టు
భైంసా, నవంబర్ 16: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఆర్జీయూకేటీ ముట్టడికి ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడంతో శనివారం బాసర పట్టణమంతా పోలీసుల బందోబస్తు కనిపించింది. వందలాది పోలీసు బలగాలతో బాసర ప్రాంతంలోని ఆర్జీయూకేటీ, సరస్వతీ ఆలయం, రైల్వేస్టేషన్, గోదావరి నది మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
భైంసా నిజామాబాద్ మార్గాల్లో, రైల్వేస్టేషన్‌లో ముమ్మర తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని, రైళ్లను తనిఖీలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి ముథోల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ హుటాహుటిన రాత్రి వరకు అక్కడే ఉండి భద్రత చర్యలు పర్యవేక్షించారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లను సైతం అధిగమించిన ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆర్జీయూకేటీ వెనుకభాగం ప్రహరీ ఎక్కి కంచెను దాటి లోనికి దూకారు. విద్యాసంస్థలోపల బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని అరెస్టు చేశారు.