దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం.. జగిత్యాల వాసులు ముగ్గురు మృతి
జగిత్యాల, జూన్ 9 (విజయక్రాంతి): దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణలోని జగిత్యాలకు చెందిన వారేనని ప్రాధమిక సమాచారం. కాగా క్షతగాత్రుల్లో నలుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తుండగా వీరిలో హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సయీద్ కూడా ఉన్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం (51), మల్యాల మండలం తక్కళ్లపల్లిలోని గొల్లపలి తిరుపతి గౌడ్ (42), మెట్‌పల్లి మండల కేంద్రంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీఖ్ (37)లు ఈ ప్రమాదంలో మరణించారు. మృతదేహాలను భారత్‌కు పంపించేందుకు దుబాయ్‌లోని భారతీయ కాన్సులేటు అధికారులు మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని భారతీయ అధికారులు పరామర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను దుబాయ్‌లోని సామాజిక కార్యకర్త గుండెళ్లి నరసింహ కూడా పరామర్శించారు.షార్జా కేంద్రంగా ఉన్న ఒక అల్యూమినియం డోర్ ఫ్రేం, గ్లాసుల పరిశ్రమలో వీరందరు పని చేస్తున్నారు. కార్మికులు ప్రయాణిస్తున్న మిని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని కూడా పేర్కొన్నారు.






