బద్ధకం వీడని ఓటరు మహాశయులు
ఏ ఎన్నికల్లోనూ 60 శాతం దాటిన పోలింగ్
ఈసీ ఎంత ప్రయత్నించినా గడప దాటని ఓటరు
చిన్న రాష్ట్రాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు
పెద్ద రాష్ట్రాల్లోనే భారీగా తగ్గుతున్న శాతం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో మూడొంతుల ఓటర్లు మాయమయ్యారు. అంటే కనిపించకుండా ఎక్కడికో వెళ్లారని కాదు అర్థం.. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. ఇంటి గడప దాటి రావడానికి వీరికి బద్ధకం ఎక్కువైపోతోంది. ఇది ఈ ఎన్నికల్లో మాత్రమే కాదు.. ఏకంగా ఓటు హక్కు భారత్‌లో మొదలైనప్పటి నుంచి ఇదే వరస. ఏ లోక్‌సభ ఎన్నికల్లో చూసినా కూడా పోలింగ్ 70 శాతం దాటలేదు. 1962 నుంచి ఇప్పటివరకు ఓటర్ల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 94.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే మూడొంతుల మంది ఓటర్లు ఓటేసేందుకు సుముఖత చూపట్లేదు. వీరందరినీ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ఎన్నికల కమిషన్ ఎంతగానో ప్రయ త్నిస్తోంది. కనీసం పోలింగ్‌ను 75 శాతానికైనా పెంచాలని శ్రమిస్తోంది. వారికి అవగా హన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇలా ఓటేయకుండా ఏకంగా 30 కోట్ల మంది ఉన్నట్టు అంచనా. వీరిలో అధికంగా పట్టణ ప్రాంతాల వారు, ఉన్నత విద్యావంతులు, వలస వెళ్లిన వారే ఉన్నారని గుర్తించింది. అసలు ఎందుకు పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది.. ఎందుకు ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఓ లుక్కేద్దాం..
ఎప్పుడు చూసినా అంతే..
తాజా సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడతలో 69.32 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అదే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోని తొలి విడతలో కూడా 69.5 శాతం పోలింగే నమోదైంది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కూడా లక్షద్వీప్‌లో అత్యధికంగా 84.16 శాతం పోలింగ్ నమోదు కాగా, బీహార్‌లో అత్యల్పంగా 49.26 శాతం మాత్రమే నమోదైంది. నాగాలాండ్‌లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినా కూడా అక్కడ 57.7 శాతం పోలింగ్ నమోందైంది. 2019లో నాగాలాండ్‌లో ఏకంగా 83 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2009లో ఆల్‌టైం రికార్డు స్థాయిలో 89.99 శాతం పోలింగ్ నమోదై దేశానికే ఆదర్శంగా నిలిచారు.
పెద్ద రాష్ట్రాల్లో మరీ వెనుకబాటు..
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇంతగా చైతన్యంతో ఓటేస్తుంటే పెద్ద రాష్ట్రాల్లో మాత్రం పోలింగ్ శాతం మరీ దారుణంగా పడిపోతూ ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో ఏకంగా సగం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదంటూ అతిశయోక్తి కాదు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా చివరి 5వ స్థానంలో నిలిచింది. కేంద్రంలో చక్రం తిప్పగల స్థాయిలో 80 లోక్‌సభ సీట్లు ఉన్న యూపీలోనే ఇలా ఉంటే ఎలా అని రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో కూడా ఏ ఎన్నికల్లోనూ 65 శాతం దాటలేదు. ఇక ముంబైలో చూసుకుంటే 1991 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే పోలింగ్ 50 శాతం దాటిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక జమ్ము కశ్మీర్‌లో అయితే 2019లో 44.97 శాతం, 2014లో 49.52% పోలింగ్ నమోదైంది.
ఈసీ ఎన్ని చర్యలు తీసుకున్నా..
దేశంలో 1951 లో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ పోలింగ్ శాతం 60 శాతానికి కొద్దిగా అటుఇటుగా నమోదవుతూ వస్తోంది. అయితే 2019లో మాత్రమే తొలిసారిగా అత్యధికంగా ఇప్పటివరకు 67.4 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 66.4 శాతం పోలిం గ్ నమోదైంది. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నో అవగాహన సదస్సులు పెడుతూ వస్తోంది. 2019లో ఏకంగా 29.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదని ఈసీ చెబుతోంది.
ఫలితాలపై ప్రభావం ఉంటుందా?
ఎన్నికల పోలింగ్ శాతాన్ని బట్టి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ విశ్లేషకులు అంచనాకు వస్తుంటారు. ఓటరు నాడీ ఎలా ఉందనే దానిపై కూడా అంచనా వేస్తుంటారు. అంతేకాదు పోలింగ్ శాతాన్ని బట్టే ప్రజాస్వామ్యం తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. ఇక పోలింగ్ శాతం పెరిగితే ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే భావన గతంలో ఉండేది. ఇప్పుడు అలా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
అక్కడ ఎందుకలా..? ఇక్కడ ఎందుకిలా?
చిన్న రాష్ట్రాలో ప్రజలను సులువుగా పోలింగ్ బూత్‌లకు రప్పించడం సులువని, అందుకే అక్కడ పోలింగ్ శాతం అధికంగా నమోదు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లలో వైవిధ్యత ఎక్కువగా ఉండటం, ఒక్కో వర్గానికి ఒక్కో డిమాండ్ ఉండటం వల్ల అన్ని వర్గాల వారిని పోలింగ్ బూత్‌లకు రప్పించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. అయితే పెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్‌లో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు కన్పిస్తాయి. వెస్ట్ బెంగాల్ పెద్ద రాష్ట్రమైనప్పటికీ అక్కడ పోలింగ్ శాతం అసాధారణ రీతిలో అధికంగా నమోదవుతుంది. దీనికి కారణం ఓటర్లను బూత్‌లకు రప్పిండచంలో అక్కడి రాజకీయ పార్టీలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా స్వాతంత్య్రా నికి ముందు నుంచే ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతులు.
వలసలు.. నకిలీ ఓట్లు.. అర్బన్ కల్చర్
పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వలసలు.. ఆ తర్వాతి స్థానంలో ఉండేది ఓటర్లలో నిర్లప్తత. సాధారణంగా ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు అనేక మంది వలస వెళ్తుంటారు. అయితే ఎన్నికల సమయంలో తిరిగి గ్రామాలకు రప్పించడం లో ఎన్నికల సంఘం, అధికారులు విఫ లమవుతున్నారనేది ఖండించలేని వాస్త వం. ఇక అక్షరాస్యత ఎక్కువగా ఉన్న వారిలో ఓటేసేందుకు నిర్లిప్తత ఎక్కువగా కనిపిస్తోంది. మెట్రో సిటీల్లోని ఉద్యోగులు ఓటు వేయడం కన్నా పోలింగ్ రోజున హాలిడే ఎంజాయ్ చేద్దామనే ధోరణి పెరిగింది. అయితే వారిలో కూడా కొందరు ఓటు హక్కు తమ బాధ్యత అని ఓటేస్తున్నారు. కొంద రు సొంత ఊరిలో ఒక ఓటు, మరో ప్రాం తంలో ఇంకో ఓటు నమోదు చేసుకుంటున్నారు. దీంతో నకిలీ ఓట్లు పెరుగుతు న్నాయి. అందుకే ఓటర్ కార్డు ను ఆధార్‌తో అనుసంధానం చేస్తే నకిలీ ఓట్లు తగ్గి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశముంటుందని సూచిస్తున్నారు.