calender_icon.png 25 March, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు త్రైమాసికాలు.. 17,343 కోట్లు

24-03-2025 12:47:46 AM

నిరుటితో పోల్చితే రూ.2,563 కోట్లు తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

  1. గతేడాది ఇదే సమయానికి రూ.19,906 కోట్ల్లు..
  2. ఎఫ్‌డీఐల సాధనలో తెలంగాణ టాప్- 7
  3. సర్వీస్ రంగాలపై విదేశీ కంపెనీల దృష్టి
  4. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలీ కమ్యూనికేషన్స్‌పై ఆసక్తి

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) ఒక దేశ లేదా ఒక రాష్ట్ర ప్రగతికి సూచిక అని అంతర్జాతీయ ప్రమాణాలు చెప్తున్నాయి. ఎఫ్‌డీఐల ద్వారా ఎన్ని పెట్టుబడులు వస్తే.. అంత ప్రగతికి ఆస్కారం ఉంటుందని అనేక ఆర్థికపరమైన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెట్టుబడులతో ఆ ప్రాంతానికి కంపెనీలు అందుబాటులోకి వస్తాయి.

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతుంది. దేశ లేదా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు పడతా యి. అందుకే  ఎఫ్‌డీఐలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాదరంగా ఆహ్వానిస్తాయి. ఆయా కంపెనీలకు రెడ్ కార్పె ట్ వేసి మరీ పెట్టుబడులను స్వాగతిస్తాయి. ఇలా తెలంగాణ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- డిసెంబర్ (మూడు త్రైమాసికాలు)లో రూ.17,343 కోట్ల ఎఫ్‌డీఐలు సాధించింది.

దేశవ్యాప్తంగా రూ.3,40,962 కోట్ల ఎఫ్‌డీలు రాగా, వాటిలో తెలంగాణ వాటా 5.08శాతం. అలా రాష్ట్రం ఎఫ్‌డీఐల సాధనలో దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. గతేడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఎఫ్‌డీఐల ద్వారా రూ.19,906 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి వచ్చిన ఎఫ్‌డీఐలు రూ.2,563 కోట్లు తగ్గింది.  2023-24తో పోలిస్తే.. ఈసారి 43.78శాతం మేర తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోకి మొత్తం రూ.78,204 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం వెల్లడిచింది. 

సర్వీస్ సెక్టార్‌లో టాప్ పెట్టుబడులు..

తెలంగాణకు వచ్చిన ఎఫ్‌డీఐల్లో సర్వీస్ సెక్టార్‌కు సంబంధించిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలీ కమ్యూనికేషన్స్, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ, ఇన్ఫాస్ట్రక్చర్, నిర్మాణ రంగం, డ్రగ్స్‌అండ్ ఫార్మా, కెమికల్ రంగాలే ఎక్కువ. ఆయా రంగాల్లో ఇప్పటికే హైదరాబాద్ దూసుకుపోతోంది.

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఫోర్త్ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ పునరుజ్జీవం విజయవంతమైతే భవిష్యత్తులో ఆయా రంగాల్లో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సర్కార్ భారీ ఎత్తున పారిశ్రామిక పార్కులు నిర్మించాలని యోచిస్తున్నది.

ఆయా పార్కుల్లో పరిశ్రమలను ఆకర్షించే విధంగా మౌకలి వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కంపెనీలు మానవ వనరులపై ప్రత్యేక దృష్టి సారిస్తుండడంతో సర్కార్ స్కిల్ వర్సిటీని కీలకమైన అంశాన్ని ఎత్తుకున్నది. రానున్న రోజుల్లో తెలంగాణను దేశంలో ది బెస్ట్ స్కిల్ హబ్‌గా మార్చే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. తద్వారా రాష్ట్రంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు రాబట్టాలనేది అసలు ప్లాన్.

మొదటి స్థానంలో మహారాష్ట్ర

దేశంలోనే అత్యధిక ఎఫ్‌డీఐలను ఆకర్షించిన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలో ఆ రాష్ట్రానికి రూ.1,39,434 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత రూ.46,687 కోట్లతో గుజరాత్ రెండోస్థానం, రూ.37,647 కోట్లతో కర్ణాటక మూడోస్థానం, రూ.37,336 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానం, రూ.24,374 కోట్లతో తమిళనాడు ఐదో స్థానం, రూ.23,955 కోట్లతో హర్యానా ఆరో స్థానంలో నిలిచాయి.