23-03-2025 08:03:53 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బిబిగూడెంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు, 8 ఏళ్ల కుమార్తె మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... కుటుంబంతో వెళ్తున్న కారును ఖమ్మం నుండి సూర్యాపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్, ఆయన భార్య రేణుక, వారి ఎనిమిదేళ్ల కుమార్తె రితికగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.