ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం సమీపంలోని రఘునాధపాలెం మండలం బూడిదంపాడు గ్రామం సమీపంలోని ఖమ్మం ఇల్లెందు రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికకక్కడే చనిపోయారు. బూడిదంపాడు రైతు వేదిక వద్ద టూ వీలర్‌పై బూడిదంపాడు వైపు వెళుతున్న వారిని ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం చేసిన వ్యక్తి బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు.
ఈ ప్రమాదంలో పువ్వాడ ఉదయనగర్‌కు చెందిన తేజావత్ వీరబాబు, భూక్యా విజయ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. రఘునాధపాలెం పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా బోనకల్ మండలం కలకోట గ్రామం వద్ద టీవీఎస్ వాహనంపై వెళుతున్న ఆళ్లపాడు గ్రామానికి చెందిన తాళ్లూరు నాగేశ్వరరావును ఎదురుగా వేగంగా వచ్చిన స్కూటీ ఢీకొనడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు.
పెనుబల్లిలో ఇద్దరికి తీవ్ర గాయాలు..
పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బైక్‌పై వెళుతున్న బీటెక్ విద్యార్ధి రావిలాల పవన్‌సాయిని డీసీఎం వ్యాన్ డీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. కాగా, పెనుబల్లి వద్ద కారు ఢీకొనడంతో వేముల కృష్ణయ్య అనే వృద్దుడికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు.