- ముచ్చటగా మూడు
- 50 మీ రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో స్వప్నిల్‌కు కాంస్యం
- ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. షూటింగ్‌లో ముచ్చటగా మూడో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల 50 మీ ఎయిర్ రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యంతో మెరిసి విశ్వక్రీడల్లో భారత మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడేలా చేశాడు. మొదట పోటీలో వెనుకబడినప్పటికీ ఆఖర్లో సింహంలా విరుచుకుపడిన స్వప్నిల్ మెడల్‌తో మెరిసి 50 మీ రైఫిల్ విభాగంలో భారత్‌కు తొట్ట తొలి ఒలింపిక్స్ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు.
ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం నెగ్గిన మనూ బాకర్.. మిక్స్‌డ్ టీమ్‌లో సరబ్‌జోత్‌తో కలిసి రెండోసారి కాంస్యం ఒడిసిపట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఈవెంట్స్‌లో ఒక్కో పతకం కొల్లగొట్టిన మన షూటర్ల ఇప్పుడు 25 మీటర్ల పిస్టల్, రైఫిల్ విభాగంలో పతకంపై గురి పెట్టారు. మిగిలిన ఈవెంట్స్‌లోనూ మన అథ్లెట్లు కనీసం క్వార్టర్స్‌కు చేరుకొని మరిన్ని పతకాలు దేశానికి పట్టుకొచ్చే పనిలో పడ్డారు.
విజయక్రాంతి, ఖేల్ విభాగం :
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో మన తుపాకీ మరోసారి పేలింది. షూటింగ్‌లో ఇప్పటికే రెండు పతకాలు రాగా.. తాజాగా మూడో పతకం దేశం ఒడిలో వాలింది. గురువారం 50 మీటర్ల రైఫిల్ పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకంతో మెరిశాడు. రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో స్వప్ని ల్ మొత్తంగా 451.4 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలవగా.. చైనాకు చెందిన యుకున్ లియు (463.6 పాయింట్లు), ఉక్రెయిన్‌కు చెందిన సెర్హియే కులిష్ (461.3 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో 50 మీ రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి షూటర్‌గా స్వప్నిల్ కుసాలే చరిత్రకెక్కాడు. గతంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో జాయ్‌దీప్ కర్మాకర్ 50 మీ రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలవడమే ఇప్పటివరకు అత్యుత్తమం. అయితే కాంస్యం నెగ్గిన ఆనందంలో ఉన్న దేశానికి మిగతా విభాగాల్లో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. కచ్చితంగా పతకం తెస్తారను కున్న బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ జోడీ ఓటములతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించి నిరాశ కలిగించారు.
తొలుత వెనుకబడి... ఆపై ఫుంజుకొని
తొలిసారి ఒలింపిక్ ఫైనల్ ఆడుతున్న స్వప్నిల్ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ గేమ్ చాలా కఠినంగా ఉంటుంది. త్రీ పొజిషన్స్ అని ఈవెంట్ పేరులో ఉన్నట్టే షూరట్లు వేర్వేరు మూడు భంగిమల్లో లక్ష్యం దిశగా షాట్‌లు సంధిస్తారు. తొలి సిరీస్‌లో షూటర్లు మోకాళ్లపై (నీలింగ్) కూర్చొని షూట్ చేస్తారు. రెండో సిరీస్ సైనిక భంగిమ (ప్రోన్)లో షూట్ చేస్తారు. ఇక చివరిదైన మూడో సిరీస్‌లో నిల్చొని (స్టాండింగ్) లక్ష్యం వైపు షాట్‌లు కొడతారు.
ఈ మూడు భంగిమల్లో స్కోరు చేసిన పాయింట్ల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. నీలింగ్, ప్రోన్ ఈవెంట్‌లో నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగిన స్వప్నిల్.. కీలకమైన మూడో పొజిషన్ స్టాండింగ్‌లో మాత్రం సత్తా చాటాడు. మోకాళ్లపై షూటింగ్‌లో 153.5 పాయింట్లు, ప్రోన్ విభాగంలో 156.8 పాయింట్లు, స్టాండింగ్‌లో 141.1 పాయింట్లు.. మొత్తంగా 451.4 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం అందుకున్నాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్లు అంజుమ్ మౌద్గిల్, సిఫ్త్ కౌర్ వరుసగా18, 31వ స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు.
నిజాయితీగా చెప్పాలంటే ఇవాళ నేను స్కోరుబోర్డును చూడలేదు. ఉదయం ఒక బ్లాక్ టీ మాత్రమే తాగి ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చాను. ఒత్తిడిని దరిచేరనీయలేదు. తొలుత వెనుకబడినట్లు అనిపించినప్పటికీ ఆ తర్వాత ఫుంజకున్నా. ఇన్నాళ్ల నా కష్టానికి, శ్రమకు దక్కిన ఫలితమే ఒలింపిక్స్‌లో కాంస్య పతకం. దేశానికి ఒక పతకం తీసుకొస్తే ఎంత అభిమానిస్తారో ఇప్పుడు కళ్లారా చూస్తున్నా. థాంక్యూ భారత్
స్వప్నిల్ కుసాలే, భారత షూటర్
12 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
50 మీటర్ల రైఫిల్-3 పొజిషన్‌లో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్ కుసాలే ఇప్పుడు నిజంగా హీరో అయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే తనకు ఆదర్శమని చెప్పిన స్వప్నిల్ కుసాలే ప్రయాణం ఎంతో ఆసక్తికరం. రైల్వే విభాగంలో టికెట్ కలెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కుసాలే తన ఒలింపిక్ కలను నెరవేర్చుకోవడానికి 12 ఏళ్లుగా ఎదురుచూస్తూ వచ్చాడు. తాజాగా ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం కొల్లగొట్టి స్వప్నిల్ తన పేరును చరితార్ధకం చేసుకున్నాడు.
29 ఏళ్ల స్వప్నిల్ కుసాలేది మహారాష్ట్రలోని కొల్హాపూర్ దగ్గర ఉన్న కంబల్వాడీ గ్రామం. 2012 నుంచి అంతర్జాతీయ షూటింగ్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ వస్తున్న స్వప్నిల్‌కు ఒలింపిక్స్ ఆడడానికి 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. పుష్కరకాలం పాటు అవకాశం రాకపోతే ఏ క్రీడాకారుడైనా నిరాశలో మునిగి తేలుతాడు. కానీ స్వప్నిల్ మాత్రం భారత మాజీ క్రికెటర్ ధోనిని ఆదర్శంగా తీసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా బయోపిక్‌ను, ఎంఎస్ ధోని సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసిన స్వప్నిల్ ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన ధ్యేయమని పేర్కొన్నాడు.
మాజీ షూటర్ తేజస్విని సావంత్ శిక్షణలో రాటుదేలిన స్వప్నిల్ కుసాలే 2022 ఆసియా గేమ్స్‌లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ, అకిల్ సోహెల్‌తో కలిసి స్వర్ణం పతకం సాధించాడు. అనేక అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొన్న స్వప్నిల్ పతకాలతో మెరిశాడు.
1 ఒలింపిక్స్‌లో 50 మీ రైఫిల్-3 పొజిషన్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం
1 50 మీటర్ల రైఫిల్-3 పొజిషన్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్ రికార్డు
పతకాల పట్టిక
దేశం స్వ ర కా మొత్తం
చైనా 11 7 4 22
ఫ్రాన్స్ 8 11 8 27
జపాన్ 8 ౩ 4 15
ఆస్ట్రేలియా ౭ 6 4 17
అమెరికా 6 13 12 31
భారత్ 0 0 3 3
నోట్: స్వ-స్వర్ణం, ర-రజతం, కా-కాంస్యం
* 6 పురుషుల విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఆరో షూటర్ స్వప్నిల్ కుసాలే. గతంలో రాజ్‌వర్ధన్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్, సరబ్‌జోత్ సింగ్ ఉన్నారు.
* నిజాయితీగా చెప్పాలంటే ఇవాళ నేను స్కోరుబోర్డును చూడలేదు. ఉదయం ఒక బ్లాక్ టీ మాత్రమే తాగి ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చాను. ఒత్తిడిని దరిచేరనీయలేదు. తొలుత వెనుకబడినట్లు అనిపించినప్పటికీ ఆ తర్వాత ఫుంజకున్నా. ఇన్నాళ్ల నా కష్టానికి, శ్రమకు దక్కిన ఫలితమే ఒలింపిక్స్‌లో కాంస్య పతకం. దేశానికి ఒక పతకం తీసుకొస్తే ఎంత అభిమానిస్తారో ఇప్పుడు కళ్లారా చూస్తున్నా. థాంక్యూ భారత్
స్వప్నిల్ కుసాలే, భారత షూటర్
* స్వప్నిల్ నీకు హృదయపూర్వక అభినందనలు. ఒకే ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్‌లో 3 పతకాలు సాధించడం గొప్ప విషయం.
ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
* స్వప్నిల్ కుసాలే నుంచి ఎవరూ ఊహించని ప్రదర్శన. కాంస్య పతకం గెలిచినందుకు నీకు అభినందనలు. ఈ ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
నరేంద్ర మోదీ, భారత ప్రధాని
* పారిస్ ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కాంస్యం గెలవడం ఆనందాన్నిచ్చింది. నీ కష్టానికి ఇది తగిన ప్రతిఫలం. షూటింగ్‌లో ఉన్న ప్రతిభకు సరైన గుర్తింపు లభించింది.
అభినవ్ బింద్రా, మాజీ షూటర్
* భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకం సాధించిన స్వప్నిల్ కుసాలేకు అభినందనలు.
భారత ఒలింపిక్ సంఘం
* 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో భారత్ తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన స్వప్నిల్ కుసాలేకు అభినందనలు.
మన్‌సుఖ్ మాండవీయ, కేంద్రమంత్రి
* స్వప్నిల్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతావ్. భారత్ తరఫున రైఫిల్ పొజిషన్‌లో మొదటి ఒలింపిక్ పతకం సాధించినందుకు అభినందనలు.
బీసీసీఐ
నేడు ఒలింపిక్స్‌లో భారతీయం
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత ఫైనల్స్ (రౌండ్ 2):
శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్
షూటింగ్: మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్:
ఈషా సింగ్, మనూ బాకర్
పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1:
అనంత్‌జీత్ సింగ్ నరుక
ఆర్చరీ: మిక్స్‌డ్ టీం (1/8 ఎలిమినేషన్స్): భారత్ (ధీరజ్ బొమ్మదేవర, అంకిత) x ఇండోనేషియా
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ (ఫైనల్ డీ): బాలరాజ్ పన్వర్
జూడో: మహిళల +78 కేజీల (ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32): తులికా మన్ x ఓర్టీజ్ (క్యూబా)
సెయిలింగ్: మహిళల డింగీ (రేస్ 3, రేస్ 4): నేత్ర కుమానన్
పురుషుల డింగీ (రేస్ 3, రేస్ 4): విష్ణు సరవనన్
హాకీ: భారత్ x ఆస్ట్రేలియా (గ్రూప్ దశ మ్యాచ్)
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్: లక్ష్య సేన్ x టియోన్ చెన్ (చైనీస్ తైపీ)
అథ్లెటిక్స్: మహిళల 5,000 మీటర్లు (హీట్ 1): అంకిత ధ్యానీ
మహిళల 5,000 మీటర్లు (హీట్ 2): పారుల్ చౌదరీ
పురుషుల షాట్ పుట్ (క్వాలిఫికేషన్): తజిందర్‌పాల్ సింగ్