20-03-2025 12:42:52 AM
అర్బన్ జిల్లాపై స్పష్టత
మేడ్చల్, మార్చి 19(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. జిల్లాలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6 మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తుండగా, అందులో మూడు మున్సిపాలిటీలు మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు కానున్నాయి.
మున్సిపల్ సవరణ బిల్లు గురు, శుక్ర వారాల్లో సభ ఆమోదం పొందే అవకాశం ఉంది. జిల్లాలోని మండల, జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు కనుమరుగు కానున్నాయి. గతంలో జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, ఐదు జడ్పిటిసి స్థానాలు ఉండేవి.
మూడు నెలల క్రితం ప్రభుత్వం 28 గ్రామపంచాయతీలను సమీప మునిసిపాలిటీలలో విలీనం చేసింది. రెండు మండలాల్లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనం కావడంతో మూడు రూరల్ మండలాలు మాత్రమే మిగిలాయి. మూడు జెడ్పిటిసి లతో జిల్లా పరిషత్ కొనసాగడం సాధ్యం కానందున ఇవి కూడా మున్సిపాలిటీలలో విలీనం అవుతాయని సందేహాలు ఉండేవి. ఎట్టకేలకు ఇది కూడా విలీనం అవుతున్నాయి.
మూడు మునిసిపాలిటీలు ఇవే!
జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూ డు చింతలపల్లి మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. మేడ్చల్ మండలానికి సంబంధించిన గ్రామాలు శ్రీ రంగ వరం, బండ మాదారం, నూతనకల్, డబిల్ పూర్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్ కోల్, రాజు బొల్లారం, రాజు బొల్లారం తండా, ఘనపూర్, గోసాయిగూడ గ్రామా లు ఎల్లంపేట మున్సిపాలిటీలో, మూడు చింతలపల్లి మండలంలోని లింగాపూర్,
కేశవరం, ఉద్దే మర్రి, నాగిశెట్టిపల్లి, కొల్తూరు, నారాయణపూర్, పోతారం, అనంతరం, లక్ష్మాపూర్, అద్రాస్ పల్లి, యే ల్ల గూడా, జగ్గం గూడా, సంపన బోలు, కేశపూర్ గ్రామాలు మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో, షామీర్పేట్ మండలంలోని తురకపల్లి, లాల్ గడి మలక్పేట్, మజీద్పూర్, ముందాయిపల్లి, సింగాయి పల్లి, మురహరి పల్లి, యాదారం గ్రామాలు అలియాబాద్ మున్సిపాలిటీలో విలీనం అవుతున్నాయి.
జిహెచ్‌ఎంసీ విస్తరిస్తే....
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తే మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలన్నీ విలీనం అవుతాయి. కొత్తగా ఏర్పాటయ్యే మూడు మున్సిపాలిటీలు మాత్రమే రింగ్ రోడ్డుకు కొద్ది దూర ములో ఉన్నాయి. ఇవి కూడా జిహెచ్‌ఎంసి లో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే మేడ్చల్ జిల్లా మొత్తం జిహెచ్‌ఎంసి పరిధిలోకి వస్తుంది.