- పేదోడి బియ్యం పెద్దోడి పాలు
- గద్వాల జిల్లాలో జోరుగా రేషన్ దందా
- సరిహద్దులు దాటుతున్న పీడీఎస్ రైస్
- మామూళ్ల మత్తులో అధికారులు
పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం యథేచ్ఛగా దారి మళ్ల్లుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్తదారుల్లో రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది. పేదోడి రేషన్ పెద్దోడి సంపదకు దారిగా మారింది. గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్‌పోస్ట్ ద్వారా రేషన్ బియ్యం సులువుగా కర్ణాటక రాష్ట్రానికి తరలుతోంది.
గద్వాల (వనపర్తి ), ఆగస్టు 25 (విజయక్రాంతి): పేదలకు అందిస్తున్న పోర్టిఫైడ్ రేషన్ బియ్యాన్ని దళారులు యథేచ్చగా దారి మళ్లిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లతో కుమ్మక్కవుతుండగా, మరికొందరు దళారులను పెట్టుకుని లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు.ఆగస్టు నెలలో కిలో బియ్యా న్ని రూ. 14 కు కొన్నారు. కొంతమంది దళారులు ఇంకో అడుగు ముం దుకు వేసి బియ్యంకు బదులుగా జొన్నలు ఇస్తామంటూ నేరుగా ఆటోల ద్వారా ఇండ్ల వద్దకు వచ్చి కొంటున్నారు.
కొంతమంది రేషన్ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలను వేయించుకుని నేరుగా డబ్బులను ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్దఎత్తున రేషన్ బియ్యం దందా జరుగుతున్నా మామూళ్లకు అలవాటు పడిన అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో చేతులను దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా రవాణా చేసే వారితో పాటు రీసైక్లింగ్ చేసే రైస్ మిల్లర్లపై చర్యలను తీసుకోవడంలో సివిల్ సప్లయీస్ అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
రేషన్ రీసైక్లింగ్..
అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని దళారులు, కొంతమంది రైస్‌మిల్లర్లు స్థానిక మిల్లుల్లోనే రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి ప్యాక్ చేసి ఆయా మిల్లర్ల పేర ఎఫ్‌సీఐకి పంపుతున్నట్లు తెలిసింది. అంతేకాక రీసైక్లింగ్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తు న్నారు.ఇలా అక్రమంగా బియ్యం దందా చేసే వారికి రేషన్ బియ్యం కాసుల వర్షం కురిపిస్తుండగా.. ప్రభుత్వానికి మాత్రం పెద్ద ఎత్తున నష్టాన్ని తెచ్చుపెడుతున్నది.
నామమాత్రపు తనిఖీలు ..
రేషన్ బియ్యం దందపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటోలు, ఇతర చిన్న వాహనాల్లో బియ్యం తరలించే వారిని అధికారులు అప్పుడప్పుడు పట్టుకుని కేసులు పెడుతున్నారు. కానీ లారీల్లో వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్న వారిని పట్టుకోవడంలో అధికారులు మీనమేషాలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు మామూళ్లు ఇస్తే దాడులు చేయరని, ఎవరికి ఎంత ముట్టజెప్పాలో అంత ఇస్తున్నామని కొంతమంది మిల్లర్లు బహిరంగంగానే చెబుతున్నారు.
34 కేసులు.. 528.4 క్వింటాళ్ల పట్టివేత..
ఈ ఏడాది జనవరి నుంచి జులై నెల వరకు జిల్లా వ్యాప్తంగా 34 చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. 528.4 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకోవడంతో పాటు 45 మందిపై కేసులను నమోదు చేశారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంలో గద్వాల జిల్లా ఉండడంతో రేషన్ బియ్యాన్ని సులువుగా సరిహద్దులు దాటిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కేటిదోడ్డి మండలం నందిన్నె గ్రామం వద్ద చెక్ పోస్టు ఉంది. ఏడు నెలల్లో పట్టుకున్న రేషన్ బియ్యంలో దాదాపు 90 శాతం ఇక్కడే పట్టుకోవడం విశేషం. కర్ణాటకకు రేషన్ బియ్యాన్ని తరలించేందుకు నందిన్నె చెక్ పోస్టు అడ్డాగా మారింది. ఇక్కడ అధికారులకు రైస్‌మిల్లర్లు మామూళ్లు ఇస్తున్నందుకే ఇంత పెద్దఎత్తున బియ్యం తరలిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు వివరించడంలో వెనుకంజ..
ప్రజలకు పౌష్టికాహారం లోపం కలుగకూడదనే ఉద్దేశ్యంతో పోర్టిఫైడ్ రేషన్ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రేషన్ బియ్యం వాడకం వల్ల కలిగే లాభాలు, అందులో ఉండే పౌష్టికాహారం గురించి ప్రజలకు పౌర సరఫరాల అధికారులు వివరించకపోతున్నారు. దీంతో రేషన్ బియ్యాన్ని లబ్ధ్దిదారులు బహిరంగ మార్కెట్‌లో అందినకాడికి అమ్ముకుంటున్నారు.
రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు
పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎవరైనా కొనుగోలు చేసినా, తరలించినా, వ్యాపారం చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలను తీసుకుంటాం. ఇప్పటికే పలు చోట్ల దాడులను నిర్వహించి వ్యాపారులపై కేసులను నమోదు చేయడం జరిగింది. పేద ప్రజలు పౌష్టికాహారం అందించే పోర్టిఫైడ్ రేషన్ బియ్యాన్ని వినియోగించుకోవాలి. రేషన్ బియ్యాన్ని ఎవరైనా తరలిస్తే నేరుగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
విమల,
పౌర సరఫరాల శాఖ మేనేజర్,
గద్వాల జిల్లా