- 9 లక్షల మంది టెన్త్, ఇంటర్ విద్యార్థుల ఎదురుచూపులు
- ఇంకా ప్రింటింగ్ కాని లాంగ్ మెమోలు!
- విద్యార్థులకు సకాలంలో అందించని అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా మెమోల జాడ కనిపించట్లేదు. పదో తరగతి ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదలైతే, ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై మూడు నెలలు దాటుతున్నా ఇంత వరకూ లాంగ్ మెమోలు ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు మార్కుల మెమోల కోసం ఎదురు చూస్తున్నారు.
కొంత కాలంగా లాంగ్ మెమోల జారీలో ఆలస్యమవుతోంది. మెమోలు అందకపోవడంతో పైచదువులకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో తీసుకునే టెన్త్ షార్ట్ మెమోలను, ఇంటర్ బోర్డు జారీ చేసే చిన్న మెమోలను కొన్ని విద్యాసంస్థలు పరిగణలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఇంటర్ బోర్డుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇంతర జరుగుతున్నా అది సర్వసాధారణమైన విషయమని అధికారులు చెప్తుండటం గమనార్హం.
ఫలితాలొచ్చి 3 నెలలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 4,51,272 మంది పాసయ్యారు. ఆ తర్వాత నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 46,731 మంది పరీక్షలు రాయగా, 34,126 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,81,003 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. ఇందులో ఫస్టియర్‌లో 4,78,723 మంది విద్యార్థులకు 2,87,261 మంది పాసైతే, సెకండియర్‌లో 5,02,280 మంది విద్యార్థులకు 3,22,432 మంది పాసయ్యారు.
అదేవిధంగా జూన్ 24న విడుదల చేసిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫస్టియర్‌లో 2,54,498 మందికి 1,62,520 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 1,38,477 మంది పరీక్షలు రాస్తే 60,615 మంది ఉత్తీర్ణులయ్యారు. టెన్త్, ఇంటర్ (సెకండియర్) కలిపి మొత్తం 8,81,050 మంది విద్యార్థులు మెమోల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా ఒకేషనల్ విద్యార్థులు కలుపుకుంటే మొత్తం సుమారు 10 లక్షల మంది విద్యార్థులు లాంగ్ మెమోల కోసం నిరీక్షిస్తున్నారు.
ఇంకా ప్రింటింగే కాని మెమోలు!
విద్యార్థులకు లాంగ్ మెమోలను అధికారులు సకాలంలో అందించడంలేదు. దీంతో అండర్ టేకింగ్, ట్రూ ఎక్స్‌ట్రాక్ట్ ఆఫ్ మార్కుల కాపీలను ఇచ్చి కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు. పదో తరగతి మార్కుల మెమో విషయంలోనైతే పాఠశాల విద్యాశాఖను ఉన్నతాధికారులు పట్టించుకోకపో వడంతోనే మెమోల జారీలో ఆలస్యమవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలొచ్చి కూడా నెల రోజులు దాటింది. అయినా ఇప్పటికీ టెన్త్ లాంగ్ మెమోలను ప్రింటింగ్‌కు ఇవ్వలేదని సమాచారం. అలాగే ఇంటర్ మెమోలు కూడా ప్రింట్ కాలేదని తెలిసింది. సకాలంలో మెమోలను విద్యార్థులకు ఇవ్వకపోవడంతో పై చదువులు, పలు టెక్నికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.
ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీ, బీటెక్‌తో పాటు ఇతర ఉన్నత చదువుల కోసం పక్క రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యా సంస్థలు ఇచ్చిన గడువులోగా లాంగ్ మెమోలను సమర్పించకుంటే అడ్మిషన్లను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో చేసేదిలేక విద్యార్థులు ఇంటర్ బోర్డు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. ఇంటర్ మెమోలు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. ఈనెల చివరన లేదా సెప్టెంబర్‌లో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారవర్గాలు తెలిపాయి.
త్వరలో ఇస్తాం
పదో తరగతి మెమోలను ఈ సారి తొందరగానే ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ నెల చివరి కల్లా మెమోలను విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. స్పెల్లింగ్ మిస్టేక్స్, రీ వెరిఫికేషన్, ఇతర సమస్యలను చెక్ చేసి, సరిగా ఉన్నాయో లేదో చూసుకొని ఇచ్చేందుకు సమయం పడుతోంది. స్కూల్ లాగిన్‌కు పంపే మార్కుల మెమోలు కూడా చెల్లుబాటు అవుతాయి. ఈ ఏడాది నుంచి మార్కుల మెమోలపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)ను సైతం మొదటిసారిగా ముద్రిస్తున్నాం. ఇప్పటికే చిన్న మెమోలపై ముద్రించాం.
డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం
పాఠశాల లాగిన్‌కు మార్కుల వివరాలు
పదో తరగతి మార్కుల మెమోకు సంబంధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు షార్ట్ మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రింట్ చేసి విద్యార్థులకు అందించేది. కానీ, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత షార్ట్ మెమోల ప్రింటింగ్‌లను నిలిపివేశారు. అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వాత కేవలం మార్కుల వివరాలను స్కూల్ లాగిన్‌కు పంపించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఆ మార్కుల వివరాలను ప్రింట్ తీసి విద్యార్థులకు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ కాలేజీలు వీటిని అనుమతిస్తున్నప్పటికినీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు వీటిని అనుమతించడంలేదు. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి దరఖాస్తు చేసుకొని మార్కుల కాపీని తీసుకుంటున్నారు.