భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఏసీఎంతో సహా ముగ్గురు మావోయిస్టులు, ఓ సానుభూతిపరుడ్ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 25న గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న నిషేధిత మావోయిస్టుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో దామరతోగు అటవీ ప్రాంతంలో నలుగురు పట్టుబడినట్లు తెలిపారు.
వారిలో ముగ్గురు మగవారు, ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. అందులో ఒకరు మావోయిస్టు సానుభూతి పరుడని చెప్పారు. పట్టుబడిన వారిలో చత్తీస్‌గఢ్‌కు చెందిన కొట్టం రాజు అలియాస్ జోగ సన్నాఫ్ పాండు, ఓఎం పాండు అలియాస్ రమేష్, పూణెం చుక్కి అలియాస్ తేజ(ములుగు జిల్లా దూదేకులపల్లి), శ్యామల ముఖేష్(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామర్‌తోగు) ఉన్నారు.