మొబిక్విక్, విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ ప్రీమియం ముగింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: గతవారం ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందిన ఫిన్‌టెక్ కంపెనీ ఒన్ మొబిక్విక్ సిస్టమ్స్, విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్ షేర్లు బుధవారం ప్రీమియం ధరలతో లిస్టయ్యి, అధికస్థాయిలోనే ముగిసాయి. 120 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయిన ఒన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఇష్యూ ధర రూ.279తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో 58 శాతం ప్రీమియంతో రూ.442 వద్ద, బీఎస్‌ఈలో 88 శాతం ప్రీమియంతో రూ.524 వద్ద లిస్టయ్యింది.
చివరకు భారీ లాభంతో రూ. 530 వద్ద ముగిసింది. ఐపీవోకు 27 రెట్లు స్పందన పొందిన రిటైల్ కంపెనీ విశాల్ మెగామార్ట్ ఆఫర్ ధర రూ. 78తో పోలిస్తే బీఎస్‌ఈలో 43 శాతం ప్రీమియంతో రూ.110 వద్ద లిస్టయ్యి, చివరకు రూ.112 వద్ద నిలిచింది. హైదరాబాద్ ఫార్మా కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ సైతం 21 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో లిస్టయ్యింది. ఆఫర్ ధర రూ.549 కాగా, రూ.660 వద్ద లిస్టయ్యి, ఇంట్రాడేలో రూ.787 వరకూ పెరిగింది. చివరకు 39.5 శాతం లాభంతో రూ. 765 వద్ద ముగిసింది.