18-03-2025 01:44:39 AM
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వం ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగ నియామకాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టింది.
వీటితో పాటు తెలుగు విశ్వవిద్యాలయాలనికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతూ మరో బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే పొట్టిశ్రీరాములు వర్సిటీ చట్ట సవరణ బిల్లును కూడా సభ ముందుకు ఆయనే తీసుకువచ్చారు.
ఆయా బిల్లుల ఆమోదం కోసం స్పీకర్ ప్రసాద్ కుమార్ చర్చించేందుకు అవకాశం కల్పించారు. కాగా, ఈ ఐదు బిల్లుల్లో తెలుగు వర్సిటీ బిల్లు, రెండు బీసీ బిల్లులపై సాయంత్రం వరకు చర్చ కొనసాగి ఆమోదం పొందాయి. ఎస్సీ వర్గీకరణ, దేవాదాయ చట్ట సవరణ బిల్లులపై మంగళవారం చర్చజరగనుంది.