- త్రీ ఇన్ వన్ సైకిల్ తయారీ చేసిన 9వ తరగతి విద్యార్థి.
- ముఖ్యమంత్రి ప్రశంసలు పొందిన 14 ఏళ్ల బుడతడు.
- సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్ లో మూడో బహుమతి.
- జాతీయస్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైన త్రీ ఇన్ వన్ సైకిల్.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): మట్టిలో మాణిక్యమై మెరిసి జాతీయస్థాయిలో నల్లమల ఖ్యాతిని నిలబెట్టాడు ఓ 14 ఏళ్ల కుర్రాడు. తాను ఆడుకునే వయసులోనే ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆడుతూ పాడుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఏకంగా 3 ఇన్ వన్ సైకిల్ తయారు చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి అశేష ఆదరణ అందుకుంటున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) బల్మూరు మండల కేంద్రానికి చెందిన గౌరమోని గగన్‌చంద్ర 14 ఏళ్ల కుర్రాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
చిన్నతనం నుండే ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులతో చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తూ మొదటగా తన తల్లి చేత చివాట్లు కూడా తిన్నాడు. అప్పుడప్పుడు తాను చేసే ఆవిష్కరణలు ఎంతో ముచ్చటగా అనిపిస్తూ తల్లి ఎంతో సంబరపడుతూ తల్లితో పాటు కుటుంబ సభ్యులు గొప్పగా మెచ్చుకోవడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళ్ళాడు. సోలార్ బట్టరీ, డిసి బ్యాటరీ, అవసరమైన సమయంలో పెట్రోల్ తోనూ సుదూర ప్రయాణం చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో సైకిల్ తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం తాను పుట్టిన ఈ నల్లమల పేరు ప్రఖ్యాతలను జాతీయస్థాయిలో వినిపించేలా తన సత్తా చాటాడు. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన ‘సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్’లో మూడో బహుమతి అందుకొని గ్రామస్తులందరి చేత శభాష్ అర్పించుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 250 మంది తమ ఆవిష్కరణలను ప్రదర్శించగా గగన్ మూడో స్థానంలో నిలిచి, ఈసారి ఫిబ్రవరిలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫేర్ పోటీలకు ఎంపికయ్యాడు. ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాటరీతో 35 కి.మీ దూరం వరకు ప్రయాణించడంతో పాటు సోలార్ విద్యుత్ సాయంతో రోజంతా ప్రయాణించేలా సైకిల్‌ను రూపొందించడం విశేషం. తన ఆవిష్కరణ తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ పోస్టుల్లో విద్యార్థిపై ప్రశంసలు కురిపించారు. దీంతో ప్రస్తుతం ఈ చిట్టి బుడతడు జాతీయస్థాయిలో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ సైకిల్‌కు డిజిటల్ స్పీడో మీటరు, సెంట్రల్ లాక్ సిస్టమ్‌తో పాటు నావిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడంతో ఈ సైకిల్ కు మరింత ఆదరణ లభిస్తుంది. అధునాతన వాహనాల్లోగానే ఈ సైకిల్‌కు ఉన్న జీపీఎస్ ద్వారా ఎక్కడి నుంచైనా ట్రాకింగ్ చేయొచ్చు. మొబైల్ వాయిస్ కమాండ్, అలెక్సా ద్వారా మ్యూజిక్, కాల్స్ ఆపరేట్ చేసేలా సైకిల్‌ను రూపొందించాడు. సైకిల్‌లో కంట్రోల్ బాక్స్‌ను గగన్ సొంతంగా తయారుచేయగా, అవసరమైన సామాగ్రిని మాత్రం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపాడు.ఈ బ్యాటరీని తీసి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మూడు గంటల పాటు ఛార్జింగ్‌చేస్తే 35 కి.మీ వస్తుంది. దీనికి తోడు ఎక్టెండెట్ బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. సైకిల్‌కు ఉన్న హబ్ మోటార్ మాగ్నటిక్ ఫోర్స్‌తో పనిచేస్తుంది. పవర్, నార్మల్ రెండు మోడ్స్‌ల్లో పెడల్ పనిచేస్తాయి. పవర్ మోడ్‌లో ఒక్కసారి తొక్కితే సైకిల్ వీల్ 30 సార్లు అటోమెటిక్‌గా తిరుగుతుంది. ఈ విధానంలో ఛార్జింగ్‌ను కూడా మిగిల్చుకోవచ్చని గగన్ తెలిపాడు.