calender_icon.png 27 September, 2024 | 12:58 PM

ఖమ్మం జిల్లాలో నష్టం 339.46 కోట్లు

09-09-2024 03:24:53 AM

  1. పంట నష్టం రూ.111.87 కోట్లు 
  2. వరదలకు 15,055 ఇళ్లు ధ్వంసం 
  3. దెబ్బతిన్న 10వేల కి.మీ. రోడ్లు 
  4. వరదల్లో చిక్కి ఆరుగురు మృతి 
  5. జిల్లా వ్యాప్తంగా 52,648 పశువులు మృతి

ఖమ్మం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా రూ.339.46 కోట్ల నష్టం జరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జిల్లాలో వరదలకు 15,055ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత నెల 30నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఆరుగురు వరదల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. కూసుమంచి మండలంలో ఇద్దరు, సింగరేణిలో ఇద్దరు, మధిరలో ఒకరు, ఎర్రుపాలెం లో ఒకరు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియో అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 52,648 పశువులు మృతి చెందాయి.

ఆవులు 20, గేదెలు 8, దున్నపోతులు 65, గొర్రెలు, మేకలు 342, కోళ్లు 5,215, పందులు 60 దాకా చనిపోయినట్లు అధికార గణంగాలు వెల్లడిస్తున్నాయి. వీటి నష్టం రూ.116.35కోట్లు. అన్ని రకాల రోడ్లు కలిపి 10వేల కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వీటి నష్టం విలువ రూ.180,37,65,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 66 పాఠశాలలు, 2 ఆస్పత్రులు, విద్యుత్ స్తంభాలు 4,070, ట్రాన్స్ ఫార్మర్లు అన్నీ కలిపి రూ.92.3కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు.  

భారీగా పంట నష్టం 

జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు దెబ్బతిని రూ.111,87,96,000 మేర నష్టం వాటిల్లింది. 18,375 రైతులకు సంబంధించి 31,119 ఎకరాల్లో పత్తి నష్టం వాటిల్లింది. 63 మంది రైతులకు చెందిన 96 ఎకరాల్లో మొక్కజొన్న, 421 మంది రైతులకు చెందిన 1,075 ఎకరాల్లో పెసలు, 30,460 మంది రైతులకు చెందిన 41,450 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 4,209 మంది రైతులకు చెందిన 6,174 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన పంట నష్టం రూ.8,64,36,000 ఉంటుందని అంచనా వేశారు. అలాగే రూ.429.65 లక్షల మేర మత్స్యసంపద నష్టం వాటిల్లింది. 

ప్రమాదం అంచున రైల్వే ట్రాక్

మున్నేరు వాగు 16 అడుగులు దాటి ప్రవాహిస్తుండటంతో ఖమ్మం నగర శివారు ప్రాం తమైన 16వ డివిజన్‌లోని ధ్వంసలాపురం అగ్రహారం కాలనీకి భారీ ఎత్తున వరద  పోటెత్తింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ వద్ద భారీగా వరద నీరు చేరి, కోతకు గురి చేస్తుం ది. ధ్వంసలాపురం హైలెవత్ వంతెన కింద భాగంలో రైల్వే ట్రాక్ ఉంది. పక్క నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతుండటం వల్ల రైల్వే ట్రాక్ కోతకు గురయ్యే ప్రమాదం నెలకొన్నది.