19-03-2025 12:40:39 AM
సంచలన తీర్పు వెలువరించిన యూపీ కోర్టు
1981లో యూపీలోని దిహులిలో 24 మంది దళితుల ఊచకోత
ముగ్గురు నిందితులకు ఉరితో పాటు జరిమానా విధించిన న్యాయస్థానం
కేసు విచారణ సమయంలోనే 14 మంది మృతి..
లక్నో: తీర్పు కొంత ఆలస్యం కావచ్చేమో కానీ తప్పకుండా న్యాయం జరుగుతుందని మరోసారి రుజువైంది. 1981లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా దిహులి గ్రామంలో 24 మంది దళితుల ఊచకోతకు సంబంధించిన కేసులో మెయిన్‌పురి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు కాప్టాన్ సింగ్ (60), రామ్‌పాల్ (60), రామ్ సేవక్ (70) లకు ఉరి శిక్షతో పాటు రూ. 50వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మార్చి 12నే ప్రత్యేక న్యాయమూర్తి ఇందిరా సింగ్ ఈ ముగ్గురిని దోషులుగా నిర్దారిస్తూ తీర్పు వెలువరించారు.
మంగళవారం ఉరి శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పగానే దోషులు కోర్టు రూములోనే కుప్పకూలి ఏడ్చేశారు. ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూటర్ రోహిత్ శుక్లా వాదనలు వినిపించారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు దోషులకు 30 రోజుల సమయమిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. జైలు అధికారులు ఈ ముగ్గురు ఖైదీలను 14 రోజుల పాటు క్వారంటైన్ బ్యారక్‌లో ఉంచి ఆ తర్వాత సాధారణ బ్యారక్‌కు మార్చనున్నారు.
పాపం చిన్నారులు కూడా..
ఆనాటి ఘటనలో 17 మందితో కూడిన ఓ గ్యాంగ్ దళిత కుటుంబాన్ని విచక్షణా రహితంగా హతమార్చింది. ఆనాడు చనిపోయిన 24 మందిలో మహిళలు, ఆరు నెలలు, రెండేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 24 మంది చనిపోవడంతో పాటు మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 17 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదవగా.. కేసు విచారణలో ఉండగానే 14 మంది వివిధ కారణాలతో చనిపోయారు.
1981 నవంబర్ 18న ఘటన జరగ్గా.. నవంబర్ 19న దిహులికి చెందిన లాయక్ సింగ్ అనే వ్యక్తిపై, మరి కొందరిపై ఐపీసీ సెక్షన్ 302, 307, 396 కింద కేసు నమోదయింది. కానీ అనేక రోజుల తర్వాత మంగళవారం తీర్పు వెలువడింది. నాటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ కూడా యూపీకి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రతిపక్ష నేత అటల్‌బిహారీ వాజ్‌పేయి బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ఫిరోజాబాద్ జిల్లాలోని దిహులి నుంచి సాద్‌పూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.