25-04-2025 12:35:46 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 24 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదు విద్యార్థులు మరో ఘనత సాధించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈసీఈ విభాగం చివరి ఏడాది విద్యార్థులు ముగ్గురు ప్రాంగణ నియామకాలలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు ఎంపికైనట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. భట్టు సాయిశ్రీజ, గాయత్రి రచన త్రిపురాణ, కక్కిరేణి మణికంఠ ఐదు సంవత్సరాల పదవీ కాలానికి ఫిక్స్ డ్ టర్మ్ ఇంజనీర్స్ (E-II గ్రేడ్)గా ఎంపికైనట్టు తెలియజేశారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బీఈఎల్ నిర్వహించిన రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల వంటి కఠినమైన ప్రాంగణ నియామక ప్రక్రియ ద్వారా ఆ ముగ్గురిని ఎంపిక చేశారన్నారు. ఈ సమాచారాన్ని అధికారికంగా బీఈఎల్ మేనేజర్ (హెచ్‌ఆర్) & సభ్య కార్యదర్శి ఏప్రిల్ 23న అధికారిక లేఖ ద్వారా గీతం హైదరాబాదులోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ)కి తెలియజేశారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, సీజీ సీ డైరెక్టర్ డాక్టర్ కె.మమతా రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ టి.లోకేష్, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తదితరులు వారిని అభినందించారు.