శక్తి స్త్రివిధా జ్ఞానబలం మంత్రశక్తిః,
కోశదండబలం ప్రభుశక్తిః,
విక్రమబలం ఉత్సాహశక్తిః
- కౌటిలీయం -(6-
శక్తి లేదా విజయం అనేది మూడు విధాలుగా ఉంటుందని అంటున్నాడు ఆచార్య చాణక్య. “జ్ఞానబలం మంత్రశక్తి, కోశసైన్యబలం ప్రభుశక్తి, పరాక్రమబలం ఉత్సాహశక్తి. వీటితో వృద్ధి పొందిన నాయకుడు శ్రేష్ఠుడు అవుతాడు. ఇవి లోపిస్తే హీవుడవుతాడు” అని అంటాడాయన. అందరూ విజయాన్ని కోరుకుంటారు. ప్రతి సంస్థా సంబంధిత రంగంలో తానే అందరినీ అధిగమించాలని, తన బృందం విజయ సాధకులు కావాలని ప్రయత్నిస్తుంది. నిజానికి విజయం అనేది సాపేక్షిక పదమే. విజయానికి నిర్దిష్ట ప్రమాణాలేమీ ఉండవు. కాకపోతే, విలువలతో కూడిన వ్యక్తిమత్వాన్ని నిబద్ధతతో నిలుపుకోవాలి. అలాంటి వారి విజయాలు ఔత్సాహికులకు మార్గదర్శనం చేస్తాయి.
విజయం అంటే మనలోని అత్యుత్తమత్వాన్ని వెలికి తీసుకోవడమే కాని, అత్యున్నత లక్ష్యాన్ని చేరడం మాత్రమే కాదు. చాలామంది విజయ సాధకులను బయటి నుండి గమనించినట్లయితే వారు అప్రయత్నంగా, ఏ అడ్డంకులు లేకుండా కదిలే మెట్లపై నుంచి విజయమనే పై అంతస్తును చేరినట్లుగా కనిపిస్తారు. నిజానికి వారి ప్రయాణం అస్తవ్యస్తమైన ప్రతి మెట్టుపై నుంచి ఎన్నో పోరాటాలు, ఓటములు, ఒడుదొడుకులు, ఎదురుదెబ్బలు వంటివన్నింటినీ చవిచూస్తుంటారు. అలా పట్టుదలతో అనేక సవాళ్లను, కష్టనష్టాలను అధిగమించి ముందుకు సాగడం వల్లే వారు విజయ సాధకులయ్యారు.
జ్ఞానబలం మంత్రశక్తి: జ్ఞానమనేది సంబంధిత రంగంలో విషయాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం, బుద్ధితో అవగాహన పరచుకోవడం, తెలివితో ఆలోచించడం. ఒకే వ్యక్తి అన్నింటిలో నిష్ణాతుడు కాలేకపోవచ్చు. అందువల్ల సమర్థవంతమైన మంత్రాంగాన్ని ఏర్పరుచుకోవాలి. సంబంధిత రంగంలో నిపుణులతో సలహాదారుల బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారి సూచనలు సలహాలు ప్రాతిపదికగా కార్యాలోచన చేసుకోవాలి. అయితే, సలహాదారులు సమర్థులైతేనే ఆశించిన ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. తక్కువ వేతనాలకు సలహాలు ఇచ్చే అసమర్థులకన్నా, ఎక్కువ వేతనాలను చెల్లించే నైపుణ్యం, అనుభవం కలిగిన సమర్థుల మంత్రాంగమే ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
కోశసైన్యబలం ప్రభుశక్తి: బలం బలాన్ని గౌరవిస్తుంది. కోశం అంటే ఆర్థికబలం కాగా, సైనిక బలమంటే ఉద్యోగుల సమర్థతగా తీసుకోవాలి. ప్రభుశక్తి అంటే అన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వహించిన గలిగిన సామర్థ్యం. బలమనేది సంస్థ పటిష్టమైన ఆర్థిక, ఉద్యోగ, వినియోగదారుల సమష్టి కృషివల్ల ఆవిష్కృతమవుతుంది. సంస్థలో నాయకుని స్థానం, తన వారిని ప్రభావితం చేయగలిగిన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనికి అదనంగా పరస్పర సహకారం ప్రాతిపదికగా తన కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న బలమైన సంబంధాలను నెలకొల్పుకోవడమూ సంస్థను బలోపేతం చేస్తుంది.
పరాక్రమబలం ఉత్సాహశక్తి: దీనినే ఇచ్ఛాశక్తి అంటాం. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం.. ఇవన్నీ ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. ఎవరిలోనైతే బలీయమైన అభిరుచి, రాజీ లేని పట్టుదల, తిరుగులేని ప్రయత్నం, ప్రణాళికా బద్ధమైన వ్యూహాలు, అవసరమైన చోట సాహసోపేతమైన నిర్ణయాలు, ధైర్యంగా వాటిని అమలు చేయడం, పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే నేర్పు వంటివన్నీ ఉంటాయో.. విజయం వారి వశమవుతుంది. విజయ సాధనలో బాహ్య ప్రేరణల కన్నా అంతర్గత ప్రేరణ ఉత్తమంగా పనిచేస్తుంది. ఉత్సాహం, ప్రయత్నం రెండూ కలిస్తేనే విజయం అన్నది అందరం గుర్తుంచుకోవాలి.
-పాలకుర్తి రామమూర్తి