calender_icon.png 30 November, 2024 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక సంఘటనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు చెల్లవు

30-11-2024 01:35:48 AM

  1. పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌లో హైకోర్టు తీర్పు
  2. రెండు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేసిన కోర్టు

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఒకే సంఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదంటూ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది.  వికారాబాద్ జిల్లా బొమ్మరాస్‌పేట పోలీసుస్టేషన్‌లో నరేందర్‌రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టివేసింది.

ఫార్మ సిటీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా లగచర్లలో కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడి సంఘటనలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ  నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఫిర్యాదులను పరిశీలిస్తే మూడు ఫిర్యాదుల్లోను నరేందర్‌రెడ్డి పేరు లేదని, కేవలం కుట్రపన్నారనే ఆరోపణ తప్ప మరెలాంటివి లేవన్నారు.

అంతేగాకుండా ఆయన భౌతికంగా పాల్గొని దాడులకు పాల్పడినట్లు లేదన్నారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం, సమయం ఒక్కటేనని, ఇదే విషయంపై అధికారులు 2, 3, 4 గంటలకు వేర్వేరుగా ఫిర్యాదులు ఇవ్వడం, వాటిపై బొమ్మరాస్‌పేట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తహసీల్దార్, డీసీఆర్బీ డీఎస్పీ ఉన్నతస్థాయిలో చదువుకున్న, బాధ్యతాయుతమైన అధికారులని, వారు స్వయంగా ఫిర్యాదు రాసి ఇవ్వాల్సి ఉండగా పోలీసు రైటర్ రాసిన ఫిర్యాదుపై సంతకం చేశారన్నారు.

వారు కనీసం సంఘటన గురించి రైటర్‌కు వివరాలు చెప్పలేదన్నారు. గతంలో జరిగిన సంఘటనపై నమోదు చేసిన వివరాలనే మిగిలిన రెండు ఫిర్యాదుల్లోనే రైటర్ పేర్కొన్నారని, దీన్ని పరిశీలించకుండా అధికారులు సంతకం చేశారన్నారు. కలెక్టర్‌పై దాడి ఘటనతో షాక్‌కు గురై ఉన్నారని, ఫిర్యాదు రాసే పరిస్థితిలో లేరన్న అదనపు అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు.

వాస్తవాలను పరిశీలిస్తే పిటిషనర్‌ను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. వికారాబాద్ డీఎస్పీ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు (ఎఫ్‌ఐఆర్ 153)పై మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దుద్యాల్ తహసీల్దార్, వికారాబాద్ డీసీఆర్బీ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ 154, 155లను కొట్టివేశారు. ఈ రెండు కేసుల దర్యాప్తులో భాగంగా సాక్షుల నుంచి ఏవైనా వాంగ్మూలాలను నమోదు చేసినట్లయితే వాటిని మొదటి కేసులో వాంగ్మూలాలుగా తీసుకోవచ్చని తీర్పు వెలువరించారు. 

లగచర్ల కేసులో నిందితుడి పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసును కొట్టివేయాలంటూ 33వ నిందితుడైన కావలి శేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ణు హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన తప్పుడు కేసును కొట్టివేయాలని కావలి శేఖర్ దాఖలు చేసిన పిటిష్ప జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ సైన్యంలో పనిచేశారని, సంఘటనా స్థలంలో లేరన్నారు.

అయినా పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చుతూ కేసు నమోదు చేశారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ నేరుగా దాడి ఘటనలో పాల్గొన్నారన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని అందజేశారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

తప్పుడు పిటిషన్ దాఖలుకు రూ.5 వేల జరిమానా

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తప్పుడు సర్టిఫికెట్‌తో ఉత్తర్వులు పొందడంతోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూర్యాపేట జిల్లాకు చెందిన జానీమియాకు రూ. 5వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీసు స్టేషన్‌లో స్వీపర్‌గా 1991 నుంచి పనిచేస్తున్నా తనకు హైకోర్టు ఆదేశించినా జీతం ఇవ్వలేదంటూ జానిమియా హైకోర్టులో 2018లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇటీవల విచారించిన జస్టిస్ జె.అనిల్‌కుమార్ వేతనం చెల్లించడానికి ఎస్పీకి మూడు వారాల గడువు ఇచ్చారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టగా పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఎక్కడా పనిచేయలేదని, 2015లో తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించి కోర్టు నుంచి 2017లో ఉత్తర్వులు పొందారన్నారు.

దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా అది తప్పుడు సర్టిఫికెట్ అని తేలిందని, ఇదే విషయాన్ని పిటిషనర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయినా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ. 5 వేలు జరిమానా విధించారు.