పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మరి కొన్ని చోట్ల గాలులు వీస్తాయంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, మలుగు, ఖమ్మం, నల్ల గొండ, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జూలై 2న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కొత్తగూడెం, హన్మకొండ, ములుగు, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసినట్లు పేర్కొంది.