26-02-2025 12:00:00 AM
సర్వమత సన్నిధి వట్ పల్లి జాతర
నేటి నుంచి మూడు రోజులపాటు ఘనంగా ఉత్సవాలు
ఆందోల్, ఫిబ్రవరి 25: జాతర ఉత్సవాలకు సంగారెడ్డి జిల్లా వట్ పల్లి వెంకట్ ఖ్వాజా ఆశ్రమం ముస్తాబయింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఆశ్రమంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్రమం చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు. మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలోభక్తులు దర్శించుకోనున్నారు. భక్తిశ్రద్ధలతో గంధాల ఊరేగింపు జాతర ఉత్సవాలలో ముఖ్యమైన గంధాల ఊరేగింపు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో గంధాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అప్పగారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గుర్రాలు, ఒంటెలు, ఎడ్లబండ్లపై, గంధాలను ఊరేగించడం అందర్నీ ఆకట్టుకుంటుంది గుర్రాలను, ఒంటెలను అందంగా అలంకరించి వాటిపై అప్పగారికి గంధాలను తీసుకువస్తుంటే వాటిని చూస్తూ భక్తి పరవశ్వంలో మునిగిపోతారు.
కార్యక్రమల వివరాలు
39 వ ఆరాధన ఉత్సవాలలో భాగంగా బుధవారం అభిషేకం, సమ చందనపేరి, సమ గంగారాధన, భజన తదితర కార్యక్రమాలు, గురువారం గందారాధన, దీపారాధన, భజన. శుక్రవారం ఖురాన్ గ్రంథ పఠన, సమ ప్రార్థన, ప్రసాద వితరణ చేస్తారు.