14-02-2025 12:37:17 AM
సిద్దిపేట, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వ్యవసాయ పాలిటెక్నిక్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సిద్దిపేట జిల్లాలోని తోర్నాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వేదిక అయింది. 2015లో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో తొలిసారి రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నారు. కంపాసాగర్, పాలెం, మాల్తుమ్మెద, జోగిపేట, తోర్నాల, రుద్రూరు, మధిర, కంది, జమ్మికుంట, బసంతపూర్, నారాయణపేట కళాశాలల నుంచి 211 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, త్రో బాల్, టెన్నికాయిట్, రన్నింగ్, జావలిన్ త్రో, వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలలో తలపడనున్నారు. కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, పాటలు, నృత్య పోటీలు సైతం నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డా. సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి, జెండా ఊపి క్రీడలను ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉప సంచాలకులు డా. ఉమారెడ్డి, యూనివర్సిటీ క్రీడా పోటీల పరిశీలకులు సురేష్, జిల్లా వ్యవసాయ అధికారిని టి. రాధిక, తోర్నాల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. శ్రీదేవి పాల్గొన్నారు.