calender_icon.png 10 October, 2024 | 9:55 AM

జన్‌ధన్ కింద 3 కోట్ల కొత్త ఖాతాలు

28-08-2024 12:30:00 AM

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎంజేడీవై కింద 3 కోట్ల కొత్త బ్యాంక్ ఖాతాలు ప్రారంభమవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజే డీవై)ను  2014 ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోదీ ఆరంభించారు. ఈ స్కీమ్ కింద 2015 మార్చి నాటికి 14.72 కోట్ల ఖాతాలు ఉండగా, అవి 2024 ఏప్రిల్ 16 నాటికి నాలుగు రెట్లు పెరిగి 53.13 కోట్లకు చేరాయి.

ఈ ఖాతాల్లోని డిపాజిట్లు 2015లో రూ. 15,670 కోట్లు ఉండగా, 2024 ఆగస్టుకల్లా రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. ఈ పథకం 10వ వార్షికోత్సవం సందర్భంగా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 కోట్లకుపైగా కొత్త ఖాతాలు ప్రారంభమయ్యేలా చూడాలన్నది తమ లక్ష్యమని అన్నా రు. 2024 ఆగస్టు 14నాటికి దేశం లో 53 కోట్ల ఆపరేటివ్ పీఎంజేడీవై ఖాతాలతో సహా మొత్తం 173 కోట్లకుపైగా ఆపరేటివ్ కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) ఖాతాలు ఉన్నాయని తెలిపారు.

దేశంలో చాలావ రకూ పెద్దలు బ్యాంక్ ఖాతాల్ని కలిగి ఉన్నారని, మిగిలిన పెద్దవారిని కూడా చేర్చాలని తాము భవిస్తున్నామన్నారు. జన్‌ధన్ ఖాతా ప్రారంభానికి, నిర్వహణకు బ్యాం క్‌లు ఎటువంటి చార్జీలు వసూలు చేయ వు. అలాగే కనీస నిల్వ చార్జీలు కూడా ఉండవు. ఉచితంగా రుపే డెబిట్ కార్డు, రూ. 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం, రూ. 10,000 వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. 

వచ్చే నెల 9న జీఎస్టీ భేటీ

పన్ను రేట్లను హేతుబద్దీకరించేందుకు సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుందని సీతారామన్ తెలిపారు. అయితే పన్ను రేట్లలో, శ్లాబుల్లో మార్పులపై కౌన్సిల్ తదుపరి రోజుల్లో తుది నిర్ణయం తీసు కుంటుందన్నారు.