calender_icon.png 4 October, 2024 | 6:59 AM

ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలపై వేటు

04-10-2024 01:46:26 AM

ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైనందుకు చర్యలు

ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్-2 ఐజీ వీ సత్యనారాయణ

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మల్టీ జోన్-2 పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలపై వేటు పడింది. వారిని వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో పెడుతూ మల్టీజోన్ ఐజీ వీ సత్యనారాయణ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ అంశంలో ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్‌ఐలను బదిలీ చేశామని సత్యనారాయణ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉండటంతో వీరిపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వీరిని లూప్‌లైన్‌కు బదిలీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదకలు, ఇతర దర్యాప్తుల ద్వారా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, వాగుల్లో,  నిషేధిత నది ప్రాంతాల్లో విచక్షణ రహితంగా ఇసుకను తవ్వితే పర్యావరణ సమతుల్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంలో డీజీపీ సీరియస్‌గా ఉన్నారని, ఏ ప్రాంతం లో ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే రహస్య విచారణ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లిం గ్, మట్కా పూర్తిగా ఆగిపోవాలని, ఇవి పునరావృతమైతే పోలీసు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

బాధ్యాయుతమైన పోస్టులో ఉండి ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినందుకుగానూ వికారాబాద్ టౌన్ పీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఏ నాగరాజును ఐజీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు.