29-03-2025 12:00:00 AM
చిన్నారుల్లో ఇద్దరు సోదరులు, సోదరి
తల్లికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఘటన
పటాన్‌చెరు, మార్చి 28: విషం కలిసిన ఆహారం తిని ఒకే కుటుంబానికి చెదిన ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ రాఘవేంద్రనగర్ కాలనీలో గురు వారం రాత్రి జరిగింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామానికి చెందిన అవురిజింతల చెన్నయ్య సుమారు ఇరవై సంవత్సరాలుగా బీరంగూడలో నివా సం ఉంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2013లో రాజిత అలియాస్ లావణ్యతో రెండో వివాహం జరిగింది. వీరికి సాయికృష్ణ(11), మధుప్రియ(9), గౌతమ్(7) పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు బీరంగూడలోని డార్విన్ స్కూల్‌లో నాలుగు, మూడు, రెండవ తరగతి చదువుతున్నారు. రాజిత ఎస్‌పీ కిడ్స్ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నది. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రాజిత, చెన్నయ్య, ముగ్గురు పిల్లలతో కలిసి భోజనం చేశారు. తల్లి, పిల్లలు అన్నం, పప్పుతో పాటు పెరుగు తిన్నారు.
తండ్రి అన్నం, పప్పుతో భోజనం చేసి చందానగర్‌కు వెళ్లి నీటిని సరఫరా చేసి రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడు. రాజిత తలుపులు తీసింది. అప్పటికే ముగ్గురు పిల్లలు నిద్రపోతున్నారు. రాత్రి 2గంటల ప్రాంతంలో రాజిత తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని కేకలు వేయడంతో నిద్రలేచిన భర్త పక్కింటి వాళ్ల సాయంతో బీరంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. ముగ్గురు పిల్లలు మాత్రం నిద్రలోనే మృతి చెందారు. సీఐ నరేశ్, ఎస్సైలు విజయ్‌రావు, సోమేశ్వరి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ పరితోశ్ పంకజ్, డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాత్రి భోజనం చేసిన ఆహార పదార్థాలతో పాటు పలు అనుమానస్పద వస్తువులను పోలీస్‌లు సీజ్ చేశారు. చిన్నారులు మృతిపై అనుమానాలు వ్యకం అవుతున్నాయి. ఆహారంలో కావాలనే విషం కలిపారా.. లేక మరో విధంగా విష ఆహారం ఇచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.