28-03-2025 08:54:13 AM
తల్లికి తీవ్ర అస్వస్థ...ఆసుపత్రిలో చికిత్స
మృతిపై అనుమానాలు..?
అమీన్ పూర్ మున్సిపాలిటీలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఘటన
విచారణ జరుపుతున్న పోలీసులు
పటాన్ చెరు: విష ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు. తల్లి తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ హృదయ విదారకఘటన అమీన్ పూర్ మున్సిపాలిటీ(Ameenpur Municipality) పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు మృతి చెందడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడక పల్లి గ్రామానికి చెందిన అవురిజింతల చెన్నయ్య గత కొంతకాలంగా కటుంబంతో కలిసి అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చెన్నయ్యకు భార్య రజిత అలియాస్ లావణ్య, ముగ్గరు పిల్లలు సాయిక్రిష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) ఉన్నారు.
గురువారం రాత్రి 9గంటల సమయంలో పిల్లలతో కలిసి రజిత అన్నం, పెరుగు తిన్నారు. చెన్నయ్య అన్నం, పప్పు మాత్రమే తిన్నాడు. పెరుగు తినలేదు. ఆ తరువాత చెన్నయ్య వాటర్ ట్యాకంర్‌తో చందానరగ్‌కు నీటి సరఫరా కోసం వెళ్లి తిరిగి రాత్రి 11గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య రజిత తలుపులు తీసింది. అప్పటికే పిల్లలు నిద్రపోతున్నారు. అయితే రాత్రి 3గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో బిగ్గరగా అరిచింది. చెన్నయ్య పక్కింటి వాళ్ల సహాయంతో తన భార్యను బీరంగూడలోని పానేసియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఇంట్లో నిద్రిస్తున్న పిల్లలను పరిశీలించగా ముగ్గురు మృతి చెందారు. పిల్లల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విష ఆహారం తినడంతోనే మృతి చెందారా..? తినే ఆహారంలో ఎవరైన విషం కలిపారా..లేదా ఇతర కారణాలు ఏమై ఉంటాయి.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని అమీన్ పూర్ సీఐ నరేశ్, ఎస్ఐ లు విజయ్ రావు, సోమేశ్వరి పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించి రజిత భర్త చెన్నయ్యను విచారించి పలు వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్, పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.