హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. డిసెంబర్ 4వ తేదీన రాత్రి అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బెనిఫిట్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఆడింది. అయితే బుధవారం రాత్రి దిల్ సుఖ్ నగర్ కు చెందిన మృతురాలు రేవతి తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు కలిసి పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కు వెళ్లారు.
ఆ సమయంలోనే సినిమాను చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారు. నటుడు థియేటర్‌లోకి ప్రవేశించి అభిమానులను పలకరించారు. దీంతో అభిమానులు థియేటర్ గేటు లోపలికి దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం సంధ్య ధియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను చిక్కడపల్లి ఏసీపీ వెల్లడించారు.