నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు
కామారెడ్డి, నవంబర్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో నమోదైన పోక్సో కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు.. శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఓ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నారు. ముగ్గురు నిందితులను శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
మండలం పరిధిలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించగా.. అనంతరం స్కూల్ టీచర్లు, మాజీ సర్పంచ్ రాజీచేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు గ్రామానికి న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు రాగా.. బాధిత కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని వారికి వివరించారు.
వారు విచారణ చేపట్టి అనంతరం నిందితులపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసు విచారణను కామారెడ్డి డీఎస్పీకి బదులుగా ఎల్లారెడ్డి డీఎస్పీతో చేయించారు. కామారెడి డీఎస్పీ నాగేశ్వర్‌రావు పనితీరుపై ఎస్పీ సింధుశర్మ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డి డీఎస్పీతో విచారణ చేయించారని చర్చ జరుగుతోంది.