08-04-2025 12:51:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7(విజయక్రాంతి) : బాడీ బిల్డింగ్ కోసం ఉప యోగించే స్టెరాయిడ్ ఇంజక్షన్లు, మాత్రలు, క్యాప్సుల్స్‌ను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురిని హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహమ్మద్ నజీర్, సంజీవ్‌లు నగరంలో సప్లిమెంట్స్ స్టోర్ నడుపుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌అనే వ్యక్తి జిమ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటుండడంతో త్వరగా బాడీ బిల్డింగ్ కోసం యువతకు స్టెరాయిడ్ ఇజక్షన్లు, ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్‌ను విక్రయించాలని ప్రణాళిక వేశాడు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని విక్రయిస్తూ డబ్బులు ఆర్జించాడు.
హుమాయున్‌నగర్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మెహదీపట్నం ఎన్‌ఎండీసీ రోడ్‌లోని సోమ టైలర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. స్టెరాయిడ్ ఇంజక్షన్లను తీసుకెళుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు సంజీవ్ సప్లిమెంట్ స్టోర్‌కు వెళ్లగా అక్కడ పెద్దమొత్తంలో 23రకాల స్టెరాయిడ్ ఇంజక్షన్లు, టాబ్‌లెట్స్, క్యాప్సుల్స్ లభ్యమయ్యాయి. ఇమ్రాన్, నజీర్, సంజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న స్టెరాయిడ్స్ విలువ రూ.1.80లక్షలు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ స్టెరాయిడ్స్ ఇంజక్షన్లకు యువత బానిస అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.