calender_icon.png 7 October, 2024 | 4:19 AM

మూడున్నర దశాబ్దాలుగా విశిష్ట సేవలు

07-10-2024 01:26:05 AM

అనేక విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న యశోద హాస్పిటల్స్

సామాజిక బాధ్యతలోనూ ముందు వరుస  

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మారుమూల గ్రామంలో ఓ చిన్న క్లినిక్‌గా ప్రారంభమై నేడు హైదరాబాద్ నగరంలో ప్రజలకు విస్తృతమైన వైద్య సేవలు అందించడమే కాకుండా, వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యశోద హాస్పిటల్.

వైద్య రంగంలో ఆధునాతన శాస్త్ర, సాంకేతికను వినియోగించుకుంటూ దాదాపు 25 విభాగాలకు పైగా విశిష్టమైన వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కార్పొరేట్ స్థాయిలో విభిన్నమైన వైద్య సేవలను అందించడంలో యశోద ఆసుపత్రి నిరంతరం అగ్రస్థానంలో నిలుస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది.

ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వరంగల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో డాక్టర్ జీ సురేందర్ రావు 1989లో చిన్న క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ వైద్య సేవలను ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సోదరులు జీ దేవేందర్ రావు, జీ రవేందర్ రావు సహకారంతో యశోద హాస్పిటల్స్ పేరుతో ప్రారంభించారు.

ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో అనుసరించే సాంకేతిక, ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకొని హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, మలక్‌పేట, సోమాజిగూడ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో సుమారు 4 వేల పడకల సామర్థ్యంతో నాలుగు శాఖలను ఏర్పాటు చేసుకుంది యశోద హాస్పి టల్. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొదటి గుండె, ఊపిరితిత్తుల మార్పిడిని 2017లోనే నిర్వహించింది. 

ప్రత్యేకతలు ఇవే.. 

హైదరాబాద్ మహా నగరంలోని యశోద ఆసుపత్రులలో దాదాపు 25 విభాగాలకు పైగా అత్యాధునిక, శాస్త్ర, సాంకేతిక రంగాలతో కూడిన వైద్య సేవలను నిర్వాహకులు మూడున్నర దశాబ్దాలుగా అందిస్తున్నారు. వీటిలో న్యూరో సర్జరీ, కార్డియాలజీ, అంకాలజీ విభాగాలలో అరుదైన కేసులను విజయవంతంగా చేయడమే కాకుండా, వైద్య రంగంలో మరింత పురోగతి సాధించారు.

న్యూరో సర్జరీలో ఇంట్రా ఆపరేటివ్ 3టీ ఎంఆర్‌ఐని ఇన్‌స్టాల్ చేసిన మొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది యశోద. బహుళ శస్త్ర చికిత్సలు అవసరం లేకుండానే మెదడు శస్త్ర చికిత్సలను సురక్షితంగా, కచ్చితంగా నిర్వహించింది. 2019 నాటికే సాంకేతికతను ఉపయోగించి 200లకు పైగా సంక్లిష్ట శస్త్ర చికిత్సలు జరిపారు.

తెలుగు రాష్ట్రాలలో 2017లోనే మొదటి గుండె, ఊపిరితిత్తుల మార్పిడి, మొట్ట మొదట రోబోటిక్ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. జీవన్ దాన్ పథకం ద్వారా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు. 2015లో అంకాలజీ కి ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. రాపిడ్ ఏఆర్‌సీ టెక్నాలజీ ఉపయోగించి 10 వేల మంది రోగుల కు చికిత్స అందించిన మైలురాయిని సాధించిన మొదటి ఆసుపత్రిగా నిలిచింది.

ఈ విధానంలో ప్రాణాంతక మెదడు కణితితో బాధపడుతున్న 3 ఏళ్ల బాలికకు శస్త్ర చికిత్స నిర్వహించారు. పుణెకు చెందిన 34 ఏళ్ల అర్చన షెడ్జ్‌కు ఇంటర్ స్టీషియల్ ఫైబ్రోసిస్ సమస్య ఉండగా శస్త్ర చికిత్స చేసి రక్షించారు. 2019లో ఎండో బ్రోన్చియల్ ఆల్ట్రాసౌండ్, అధునాతన ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలపై మొదటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్‌ను నిర్వహించారు.

ప్రపంచంలో కొన్ని ఆసుపత్రుల్లోనే ఉన్న బ్రోన్చియల్ థర్మోప్లాస్టీ, ఈబీయూఎస్, రేడియల్ ఈబీయూఎస్, నావిగేషనల్, బ్రోంకోస్ అధునాతన సాంకేతికత యశోద ఆసుపత్రుల్లో ఉంది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ బ్రోంకాలజీ అండ్ ఇంటర్నేషనల్ పల్మోనాలజీ (డబ్ల్యూఏబీఐపీ) నుం చి యశోద హాస్పిటల్స్‌కు బ్రాంకోస్కోపీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 

సామాజిక సేవలోనూ..

కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద అనేక ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలకు వ్యాధుల పట్ల సరైన అవగాహన పెంచడంతో పాటు అనాథలకు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా వైద్యులు కావాలనుకునే విద్యార్థులకు అనుభవపూర్వకమైన అభ్యాసాన్ని అందించడంలో క్రియాశీ లక పాత్ర పోషిస్తుంది.

2011 నుంచి అనాథలకు సేవలు అందిస్తూ వారి జీవనోపాధి కోసం పనిచేస్తుంది. అభయ, వారధి, అక్షర, మా కుటుంబం తదితర కార్యక్రమాల ద్వారా అనాథలకు సంపూర్ణ సహాయాన్ని అందిస్తున్నారు. ఉచిత వృత్తి విద్యా కోర్సులకు శిక్షణ అనంతరం యశోద హాస్పిటల్స్ లోనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

2017లో యశోద ఫౌండేషన్ ద్వారా ముగ్గురు అనాథ బాలికలకు వివాహాన్ని నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో చైర్మన్ జీ రవేందర్ రావు కన్యాదానం చేశారు. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని యశోద క్యాన్సర్ అవేర్‌నెస్ రన్‌ను నిర్వహిస్తుంది.