calender_icon.png 19 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్చర్ టీచర్ ను కాపాడుతున్నదెవరు.!

16-04-2025 04:26:45 PM

స్నానపు గదుల్లో విద్యార్థుల ఫోటోలు వీడియోలతో బెదిరింపులు.. 

ఫోక్సో కేసు నమోదైనా విచారించని పోలీసులు.. 

పది తరగతి మూల్యాంకనంలోనూ విధులు..

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ స్నానపు గదుల్లో విద్యార్థుల ఫోటోలు వీడియోలు తీసి ఇతరులకు చేరవేస్తూ బ్లాక్ మెయిల్ గురి చేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న కారణాలతో చెంప దెబ్బలు, గోడ కుర్చీలు వంటివి వేయిస్తూ స్నానపు గదుల్లో తీసిన వీడియోలను ఇతరులకు పంపుతానంటూ వేధింపులకు గురి చేస్తున్న టీచర్ పై చర్యలు తీసుకోవాలని కస్తూర్బా గాంధీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ఆమెపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

కేసు నమోదయి వారం రోజులైనా బయటికి చెప్పకుండా విచారించకుండా సదరు టీచర్ను కాపాడేందుకు పోలీసులను రాజకీయ ఒత్తిళ్లకు గురి చేస్తున్నది ఎవరన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రికేత్తిస్తోంది. ఈనెల 6న తన టార్చర్ వల్ల యామిని అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని చాకుతో చేతిని కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ ఆధారంగా సదరు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కానీ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న సదరు టీచర్ కు పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యంకనం బాధ్యతలు అప్పజెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

నియంతలా వ్యవహరిస్తూ విద్యార్థులపై చీటికిమాటికి గొడవపడే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు టీచర్ అదే సమయంలో 9 రోజులపాటు 10వ తరగతి విద్యార్థులు రాసిన  360 జవాబు పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేసి విచారించాల్సిన పోలీసులు కేసు గోప్యత పాటించడం వెనక ఆంతర్యమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు టీచర్ చేత మూల్యాంకనం జరిపించడం వెనక ఎవరి ఒత్తిడి దాగిందని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఫోటోలు వీడియోలు తీసిన సెల్ఫోన్ స్వాధీనం చేసుకోకుండా కేసును నీరుగార్చేందుకు పోలీసు అధికారులు సైతం పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు వెతుకుతున్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు, విద్యాశాఖ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.